IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా.. రికార్డులు చూస్తే పరేషానే..
Jasprit Bumrah Captaincy Record: రోహిత్ శర్మ గైర్హాజరీలో పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా సారథ్యంలోని టీమిండియా గత ప్రదర్శనను పరిశీలిస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడి, ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. అలాగే, కెప్టెన్‌గా టీ20లో ఐర్లాండ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Updated on: Nov 19, 2024 | 7:40 AM

నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరగనున్న పెర్త్ టెస్టుకు టీమిండియా శాశ్వత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. రోహిత్ గైర్హాజరీలో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అయితే, అంతకు ముందు బుమ్రా సారథ్యంలో టీమిండియా ఆటతీరును ఓసారి పరిశీలిద్దాం.

ముందుగా టెస్టు ఫార్మాట్‌లో బుమ్రా కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బుమ్రా కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను నడిపించాడు. జులై 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

వాస్తవానికి, 2021లో భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిర్వహించింది. కానీ, మొదటి నాలుగు మ్యాచ్‌ల తర్వాత, కోవిడ్-19 మహమ్మారి కారణంగా వచ్చే ఏడాది అంటే 2022లో చివరి టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

దీని ప్రకారం, 2022లో నిర్వహించిన చివరి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా టీమిండియాను నడిపించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దీంతో బుమ్రా సారథ్యంలోని ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఆ తర్వాత 2023లో ధర్మశాలలో జరిగిన టెస్టులో బుమ్రా పూర్తి స్థాయి కెప్టెన్‌గా లేడు. అయితే, కెప్టెన్ రోహిత్ గాయపడడంతో, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా భారత జట్టును నడిపించాడు. బుమ్రా కెప్టెన్సీలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 195 పరుగులకు ఆలౌట్ చేసి, ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ఫార్మాట్ గురించి మాట్లాడితే.. ఆగస్టు 2023లో ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించాడు. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. బుమ్రా కెప్టెన్సీలో భారత్ తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.





























