
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ జోడీ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరు నంబర్ 1 ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఈ సీజన్‌లో కోహ్లీ, డు ప్లెసిస్ 13 ఇన్నింగ్స్‌ల్లో 872 పరుగులు చేశారు.

ఈ సీజన్‌లో కోహ్లీ, డు ప్లెసిస్‌ల ఓపెనింగ్ జోడీ 3 సెంచరీ భాగస్వామ్యాలు, 4 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పింది. అంతకుముందు, ఓపెనింగ్ జోడీ జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ 10 ఇన్నింగ్స్‌ల్లో 791 పరుగులు చేశారు.

డు ప్లెసిస్‌తో తన విజయవంతమైన భాగస్వామ్య రహస్యాన్ని కోహ్లీ బయటపెట్టాడు. డు ప్లెసిస్‌తో తన అద్భుతమైన భాగస్వామ్యానికి టాటూ కారణమంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ ఒకరినొకరు ఇంక్ బాయ్స్ అని పిలుచుకుంటుంటారు.

తాను, ఏబీ డివిలియర్స్ కలిసి బ్యాటింగ్ చేసినట్లుగానే డు ప్లెసిస్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నానంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఆట ఎటువైపు వెళ్తుందో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారిద్దరికి చక్కని అవగాహన ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ, డు ప్లెసిస్ ఇద్దరికీ టాటూలంటే చాలా ఇష్టం. ఇద్దరూ తమ శరీరాలపై చాలా టాటూలు వేయించుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం కూడా చాలా ప్రత్యేకకంగా ఉంటుంది.