
పాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆయన గతేడాది యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే తాను మొదటి సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని కమిన్స్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో బరిలోకి దిగేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి అనుమతి లభించలేదు. దీంతో తుది స్కాన్, ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఆయన స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగలనుంది.

కమిన్స్ గైర్హాజరీలో విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కిషన్ సారథ్యంలో హైదరాబాద్ ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోయినప్పటికీ, రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్, తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. కమిన్స్ తిరిగి వచ్చే వరకు కిషనే జట్టును నడిపించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, ఆస్ట్రేలియాలో జరిగే వైద్య పరీక్షల్లో కమిన్స్ ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే ఆయన తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 17 నాటికి ఆయన మళ్ళీ జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ స్కాన్ నివేదికలు ప్రతికూలంగా వస్తే, ఈ సీజన్ మొత్తానికి ఆయన దూరం కావచ్చు. కమిన్స్ లేని పక్షంలో జట్టులో విదేశీ ఆటగాళ్లుగా ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ మలింగ వంటి వారు కీలకం కానున్నాడు.

పాట్ కమిన్స్ కేవలం అద్భుతమైన బౌలర్ మాత్రమే కాదు, చతురత కలిగిన నాయకుడు కూడా. గత సీజన్‌లో జట్టును ముందుండి నడిపించిన ఆయన అనుభవం ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ఎంతో అవసరం. అయితే ఇషాన్ కిషన్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు రాణిస్తుండటం జట్టుకు సానుకూల అంశం. రేపు రాజీవ్ గాంధీ స్టేడియంలో లక్నోతో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది.