
భారత జట్టుకు సెలక్ట్ అయిన రితురాజ్ గైక్వాడ్.. ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉండవచ్చు. కానీ, అతను తన బలమైన బ్యాటింగ్ ఆధారంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లోనే ఈ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయాడు. అలాగే సెంచరీ పూర్తి చేసి అలరించాడు.

మహారాష్ట్ర, రైల్వేస్ మధ్య ఈ మ్యాచ్ రాంచీలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. జట్టులో శివమ్ చౌదరి 46, కెప్టెన్ కర్ణ్ శర్మ 40 పరుగులు చేశారు.

రితురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని మహారాష్ట్ర జట్టు 218 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఘనత గైక్వాడ్‌కే దక్కుతుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన గైక్వాడ్ 123 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు.

గైక్వాడ్‌తో పాటు ఆ జట్టు రెండో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 80 బంతుల్లో 75 పరుగులు చేశాడు. రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి పునాది వేశారు.

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పర్యటనలకు బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించింది. అయితే, రెండు పర్యటనల్లోనూ రితురాజ్ గైక్వాడ్ ఎంపిక కాలేదు. అతను నిరాశ చెందలేదు. తన బ్యాటింగ్ లైనప్‌కు పదును పెట్టాడు. విజయ్ హజారే గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో గైక్వాడ్ ఐదు సెంచరీలు సాధించాడు. తన బ్యాటింగ్ బలంతో మళ్లీ టీమ్ ఇండియాలో చోటు కోసం పాగా వేస్తున్నాడు.