
ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్, 2026లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ 2026 సీజన్‌లను దృష్టిలో పెట్టుకొని తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను గణనీయంగా సవరించింది. ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ధరల ప్రకారం, ప్లాన్‌ల రేట్లు దాదాపు రెట్టింపు కావడంతో క్రికెట్ అభిమానులలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వార్షిక ప్రీమియం రూ. 1499గా ఉండగా, ఇప్పుడు అదే ప్లాన్ ధర ఏకంగా రూ. 2199కి పెరగడం మార్కెట్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. మొబైల్ వినియోగదారులు ఇకపై నెలకు రూ. 79, మూడు నెలలకు రూ. 149, ఏడాదికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్లాన్‌లో యాడ్స్ తప్పదని సంస్థ స్పష్టం చేసింది. సూపర్ ప్లాన్ ధరలను కూడా ఏడాదికి రూ. 1099కి పెంచారు. ఇది రెండు డివైజ్‌లలో లాగిన్ అయ్యే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అత్యంత ఖరీదైన ప్రీమియం ప్లాన్ ఇప్పుడు ఏడాదికి రూ. 2199కి చేరింది. దీని ద్వారా యూజర్లు నాలుగు డివైజ్‌లలో ఎలాంటి యాడ్స్ లేకుండా లైవ్ స్పోర్ట్స్, సినిమాలను వీక్షించవచ్చు.

పాత సబ్‌స్క్రైబర్‌లకు ఆటో రెన్యూవల్ ఆప్షన్ ఉంటే ప్రస్తుతానికి పాత ధరలే వర్తిస్తాయని సంస్థ ప్రకటించడం పాత వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే కొత్తగా చేరేవారికి మాత్రం ఈ భారం తప్పదు. ఈ వ్యూహాత్మక ధరల పెంపు వెనుక లోతైన ఆర్థిక కారణాలు, మార్కెట్ విశ్లేషణలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. జియో హాట్‌స్టార్ విలీనం తర్వాత కంటెంట్ లైబ్రరీ భారంగా పెరగడం, హాలీవుడ్ టైటిల్స్ డిఫాల్ట్‌గా అందుబాటులోకి రావడం ధరల పెరుగుదలకు ఓ కారణంగా కనిపిస్తోంది.

గత 11 నెలల్లో కనెక్టెడ్ టీవీ వినియోగదారుల సంఖ్య అసాధారణంగా పెరగడం వల్ల పెద్ద స్క్రీన్‌లపై ప్రీమియం కంటెంట్ వీక్షించే వారి నుంచి అధిక ఆదాయాన్ని రాబట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం క్రికెట్ సీజన్‌కు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీని తీసిపారేయలేం. ఐపీఎల్, ప్రపంచకప్ సమయాల్లో వ్యూయర్‌షిప్ రికార్డు స్థాయిలో ఉంటుంది. ప్రకటనలతో కూడిన ప్లాన్‌లను తక్కువ ధరకు ఉంచి యాడ్ ఫ్రీ కోరుకునేవారి నుంచి భారీ వసూళ్లకు తెరలేపింది.