
IPL 2026 Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభోత్సవం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. అందుకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కావడం గమనార్హం. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం చుట్టూ కొనసాగుతున్న వివాదం. ఆ వివాదం కారణంగా ఐపీఎల్ ప్రారంభోత్సవంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, కొత్త సీజన్ తొలి, చివరి మ్యాచ్‌లు డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్‌లో జరగడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభోత్సవం కూడా ఇదే మైదానంలో జరగాల్సి ఉంది. అయితే, కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం చుట్టూ ఉన్న వివాదం గందరగోళాన్ని మరింత పెంచింది.

మీడియా నివేదికల మేరకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆర్‌సిబికి ఇంకా అనుమతి రాలేదు. గత సంవత్సరం ఐపీఎల్ టైటిల్ విజయోత్సంలో జరిగిన తొక్కిసలాట దీనికి కారణంగా తెలుస్తోంది. ఆ సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో స్టేడియంలోని అన్ని కార్యకలాపాలను నిషేధించారు. ఫలితంగా, ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం వివాదం పరిష్కారం కాకపోవడంతో, ఈ ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఐపీఎల్ 2026 ప్రారంభ వేడుక ఎక్కడ జరుగుతుంది? దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రెండు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మొదటిది ఏమిటంటే, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగకపోతే, ఆర్సీబీ డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ ఆడవచ్చు అని తెలుస్తోంది. అక్కడే ప్రారంభ వేడుకను నిర్వహించవచ్చు. మరొక ప్లాన్ మేరకు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ సొంత మైదానం ముల్లాన్‌పూర్‌లో దీనిని నిర్వహించాల్సి ఉండవచ్చు.

నివేదికల ప్రకారం, చిన్నస్వామి వివాదాన్ని పరిష్కరించడానికి జనవరి 21న ఆర్‌సీబీ, కర్ణాటక ప్రభుత్వం మధ్య సమావేశం జరిగింది. అయితే, ఆ సమావేశం ఫలితం ఏమిటో తెలియదు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ జనవరి 27 వరకు ఆర్‌సీబీకి గడువు ఇచ్చింది.