
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 వేలం ప్రక్రియకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2024 యాక్షన్ డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈసారి వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా వేలంలో ఎవరు ఎక్కువ ధర పలుకుతారోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత సీజన్‌లో ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కుర్రాన్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతనికి రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఈ వేలంలో గత రికార్డులు బద్దలు కానున్నాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, ప్రపంచ కప్ సెన్సేషన్ ట్రెవిస్ హెడ్ రికార్డు మొత్తానికి అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 యాక్షన్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను 20 కోట్లకు కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ముందుకు రానున్నాయని తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియాపై సెంచరీ సాధించిన హెడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌ను చూసి టీమ్‌లు అతనికి రూ.20 కోట్లు చెల్లించేందుకు కూడా రెడీ అయ్యాయట.

ప్రస్తుతం వేలంలో గుజరాత్ టైటాన్స్ వద్ద 38.15 కోట్ల పర్స్ ఉంది. అలాగే హైదరాబాద్ పర్స్ విలువ రూ. 34 కోట్లు, KKR వద్ద రూ. 32.7 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 28.95 కోట్లు, పంజాబ్ రూ. 29.1 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ రూ. 23.25 కోట్ల పర్స్ ఉంది.

ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 42 టెస్టులు, 64 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2904 పరుగులు, వన్డేల్లో 2393 పరుగులు చేశాడు. అంతేకాదు, ఐపీఎల్ కోణంలో చూస్తే.. హెడ్ టీ20 రికార్డు కూడా బాగుంది. 22 టీ20 మ్యాచుల్లో 146.17 స్ట్రైక్ రేట్‌తో 554 పరుగులు చేశాడు.

ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై ట్రావిస్ హెడ్ 137 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో 62 పరుగులు చేశాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన 5 టీ20ల మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారీగా పరుగులు చేశాడు.