
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ సారధి ఎంఎస్ ధోని ఓ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. రిటైర్‌మెంట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న సమయంలోనూ ధోని ఇలా రికార్డులు లిఖించడంతో క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

అసలు ఆ రికార్డు వివరాలేమిటంటే.. చెన్నై వేదికగా జరిగిన శుక్రవారం మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ప్రదర్శన కనడరిచాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఒక క్యాచ్, ఒక రనౌట్, ఒక స్టంప్ అవుట్‌తో వికెట్ వెనుక నిలబడి సరి కొత్త రికార్డు సృష్టించాడు.

41 ఏళ్ల ఎంఎస్ ధోని టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్. ఈ రికార్డు గతంలో క్వింటన్ డికాక్ పేరిట ఉండేది. ఈ ఐపీఎల్ సీజన్ ధోనికి చివరి సీజన్ అని ప్రచారం సాగుతొన్న క్రమంలో ధోని ఇలాంటి ప్రదర్శన కనబర్చడం విశేషం.

శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ మొత్తం 207 క్యాచ్‌లతో.. టీ20 క్రికెట్‌లో ఎక్కువ క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో ఆడమ్ మార్క్రమ్ క్యాచ్ పట్టిన ధోనీ.. డీకాక్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై తరఫున జడేజా 3 వికెట్లు తీశాడు.

లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన చెన్నైని డెవాన్ కాన్వే జట్టును విజయతీరాలకు చేర్చాడు. 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 77 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. సీఎస్‌కే 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సాధించింది.