
IPL 2021: ఐపీఎల్ సీజన్ రెండవ భాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కొంతమంది కొత్త ముఖాలు టోర్నమెంట్‌లో కనిపించనున్నాయి. ఏప్రిల్‌లో ప్రారంభమైన సీజన్‌లో వివిధ జట్లలో భాగమైన చాలా మంది విదేశీ ఆటగాళ్లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండవ భాగంలో కనిపించరు. దీంతో ఆయా టీంలు వారి స్థానాలను భర్తీ చేయడానికి అనేక కొత్త ముఖాలను చేర్చుకున్నాయి. వారిలో చాలా మంది మొదటిసారి ఐపీఎల్‌లో ఆడనున్నారు. మొదటిసారి ఐపీఎల్‌లో తమ సత్తా చూపించగల అలాంటి కొంతమంది ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.

శ్రీలంక స్పిన్నర్ కం ఆల్ రౌండర్ వనిందు హసరంగ, ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే, టీ 20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడమ్ జాంపా స్థానంలో శ్రీలకం ప్లేయర్‌ను చేర్చుకుంది. హసరంగ మొదటిసారి ఐపీఎల్ జట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ నాయకత్వంలో ఆర్‌సీబీకి స్టార్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ, ఇటీవలి హసరంగ ప్రదర్శనతో అతని అరంగేట్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హసరంగ ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 63 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 83 వికెట్లు తీయడంతో పాటు 770 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు లేకపోవడం రాజస్థాన్ రాయల్స్‌పై అతిపెద్ద ప్రభావం పడింది. జట్టులోని ముగ్గురు ప్రధాన విదేశీ ఆటగాళ్లు - బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ ఈ సీజన్‌లో ఆడడం లేదు. బట్లర్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్థాన్ జాయిన్ చేసుకుంది. జట్టులో మంచి విదేశీ బ్యాట్స్‌మన్‌లు లేరు. ఈ స్థానాన్ని ఫిలిప్స్ బాగా పూరించగలడని టీం ఆశిస్తోంది. 24 ఏళ్ల ఫిలిప్స్ 144 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 142 స్ట్రైక్ రేట్ వద్ద 3998 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి.

ఆర్‌సీబీ చాలా మంది కొత్త ఆటగాళ్లను చేర్చుకుంది. అందులో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు టిమ్ డేవిడ్. సింగపూర్‌కు చెందిన ఈ దూకుడు బ్యాట్స్‌మెన్ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించాడు. టీ 20 బ్లాస్ట్ నుంచి కరేబియన్ ప్రీమియర్ లీగ్ వరకు వివిధ టోర్నమెంట్లలో, డేవిడ్ మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. డేవిడ్ మొత్తం 62 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 153 స్ట్రైక్ రేట్ వద్ద 1468 పరుగులు చేశాడు.

ప్రపంచ నంబర్ వన్ టీ 20 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడాన్ మార్కమ్‌ను ఇటీవల పంజాబ్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది. ఈఏడాది దక్షిణాఫ్రికా తరఫున మార్క్రామ్ ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. దూకుడు బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. 59 టీ20 మ్యాచ్‌లలో 128 స్ట్రైక్ రేట్‌లో 1424 పరుగులు చేశాడు. దీంతో పాటు 12 వికెట్లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ కోసం విదేశీ ఆల్ రౌండర్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు.