
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో నేడు రెండో వన్డే, బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో శనివారం, జులై 29న జరగనుంది.

ఇదే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో సులువుగా గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే ప్రదర్శనను కొనసాగించేందుకు రోహిత్ టీమ్ ప్రయత్నిస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది.

2006 నుంచి కరీబియన్ దీవుల్లో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటూ వస్తున్న టీమిండియా.. వెస్టిండీస్ పై చివరిగా ఆడిన తొమ్మిది వన్డేల్లో విజయం సాధించింది. అందుకే ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఫేవరెట్‌గా మారింది. ఇదే మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మూడు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు.

రవీంద్ర జడేజా: ఇప్పటివరకు ఆడిన 30 వన్డేల్లో మొత్తం 44 వికెట్లు పడగొట్టి, భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో స్టార్ ఆల్ రౌండర్ జడేజా సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోర్ట్నీ వాల్ష్ తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన 38 మ్యాచ్‌లలో 44 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో జడేజా కనీసం ఒక్క వికెట్ అయినా సాధించగలిగితే.. భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు.

విరాట్ కోహ్లీ: తొలి వన్డేలో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లి బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేస్తే.. అంటే 102 పరుగులు చేస్తే 13 వేల పరుగులు పూర్తి చేస్తాడు.

కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో 12,898 పరుగులతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 102 పరుగులు చేస్తే, వన్డేల్లో 13,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత, ఓవరాల్ ఐదవ బ్యాట్స్‌మన్ అవుతాడు. అలాగే అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.

కోహ్లి-రోహిత్: కోహ్లీ, రోహిత్ ఇప్పటి వరకు వన్డేల్లో 85 సార్లు కలిసి బ్యాటింగ్ చేశారు. ఇందులో ఈ జోడీ ఏకంగా 4998 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 2 పరుగులు చేస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో బ్యాటింగ్ జోడీగా రికార్డులకెక్కుతారు.

ఈ మూడు రికార్డులతో పాటు వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్, విరాట్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ వంటి ఎలైట్ లిస్ట్‌లో చేరడానికి రోహిత్‌కు ఇంకా 163 పరుగులు అవసరం.