ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకి కెప్టెన్‌గా ఇది తొలి ప్రపంచ కప్. అయితే తన కెప్టెన్సీలో జట్టును విజేతగా నిలిపే యోచనతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు హిట్‌మ్యాన్.
అత్యధిక సెంచరీలు: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ మరో సెంచరీ చేస్తే.. సచిన్ రెండో స్థానంలోకి దిగిపోతాడు. ఇంకా అత్యధిక వరల్డ్ కప్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానంలో ఉంటాడు.
1000 పరుగులు: 2015, 2019 వరల్డ్ కప్ టోర్నీల్లో 17 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ మొత్తం 978 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ మరో 22 పరుగులు చేస్తే.. భారత్ తరఫున వన్డే వరల్డ్ కప్‌లో 1,000 పరుగుల మార్క్‌ను దాటిన నాలుగో భారతీయుడిగా నిలుస్తాడు. రోహిత్ కంటే ముందు సచిన్ (2278), విరాట్ కోహ్లీ(1030), సౌరవ్ గంగూలీ(1006) ఉన్నారు.
అత్యధిక సిక్సర్లు: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించేందుకు రోహిత్ మరో 3 సిక్సర్లు బాదితే చాలు. ప్రస్తుతం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 551 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
18,000 పరుగులు: భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 18,000 పరుగులు చేసిన 5వ భారత ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ శర్మ మరో 352 పరుగులు చేస్తే చాలు. రోహిత్ 451 మ్యాచ్‌ల్లో 17642 పరుగులు చేయగా.. అతని కంటే ముందు సచిన్(34357), కోహ్లీ(25767), రాహుల్ ద్రావిడ్(24064), సౌరవ్ గంగూలీ(18433) ఉన్నారు.
100 అర్థ శతకాలు: అంతర్జాతీయ క్రికెట్‌లో 100 అర్ధ శతకాలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా అవతరించేందుకు రోహిత్ మరో 3 హాఫ్ సెంచరీలు చేస్తే చాలు. రోహిత్ కంటే ముందు సచిన్(164), ద్రావిడ్(146), కోహ్లీ(132), సౌరవ్ గంగూలీ(107) ఉండగా.. హిట్ మ్యాన్ 97 అర్థ సెంచరీలతో 5వ స్థానంలో ఉన్నాడు.