
ఐసీసీ అవార్డులో భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. సెప్టెంబరు నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐసీసీ నేడు (సోమవారం) ప్రకటించింది. భారత స్టార్ బ్యాట్స్ ఉమెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ అవార్డులో సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్ ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకుంది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 1999 తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఆ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో మొత్తం 221 పరుగులు చేసి, కౌర్ సత్తా చాటింది.

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ అజేయంగా 74 పరుగులు చేసింది. రెండో వన్డేలో 143 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ నెల ఉత్తమ పురుష ఆటగాడిగా ఎంపికయ్యాడు. రిజ్వాన్ తొలిసారిగా ఈ అవార్డును గెలుచుకున్నాడు.

రిజ్వాన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత 10 టీ20 మ్యాచ్‌ల్లో 553 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో అతని సగటు 69.12గా నిలిచింది. ఆసియా కప్ తర్వాత, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసింది.