- Telugu News Photo Gallery Cricket photos Happy birthday smriti mandhana indian women cricket team opener smriti mandhana born on this day
150 బంతులు… 224 పరుగులు.. 17 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించిన టీమిండియా మహిళ క్రికెటర్!
Happy Birthday Smriti Mandhana: మహిళల క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లలో స్మృతి మంధనా ఒకరు. గత ఎనిమిది సంవత్సరాలుగా, ఆమె టీమిండియాలో కీలకంగా ఉండడంతోపాటు టీ 20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తోంది.
Updated on: Jul 18, 2021 | 10:25 AM

తన సోదరుడిని చూసి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన స్మృతి మంధనా.. 17 సంవత్సరాల వయసులో 150 బంతుల్లో 224 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. అలాగే టీ 20 లో భారత్ తరఫున 24 బంతుల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో ఈ ఇన్నింగ్స్ ఆడింది. ఇప్పటివరకు 81 టీ 20 మ్యాచ్‌లు ఆడి 1901 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో స్మృతి 13 సార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ కియా సూపర్ లీగుల్లో కూడా ఆడింది.

19 సంవత్సరాల వయస్సులో భారత జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ రోజు(జులై 18, ఆదివారం) స్మృతి మంధనా పుట్టినరోజు. ఏప్రిల్ 2013 లో భారత జట్టులో అరంగేట్రం చేసిన మంధనా.. గత ఎనిమిదేళ్లుగా రికార్డు స్థాయిలో ఇన్నింగ్స్ ఆడుతూ.. టీమిండియాకు విజయాలను అందిస్తోంది.

స్మృతి మంధనా జులై 18, 1996 న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు కూడా క్రికెట్ ఆడేవారు. తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మహారాష్ట్ర అండర్ -15 జట్టులో చోటు దక్కించుకుంది. 11 సంవత్సరాల వయస్సులో మంధనా అండర్ -19 జట్టులో చేరింది. 2013 అక్టోబర్‌లో స్మృతి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ జోన్ అండర్ -19 టోర్నమెంట్‌లో గుజరాత్‌పై 150 బంతుల్లో 224 పరుగులతో అజేయంగా నిలిచింది. లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ మంధనా రికార్డు నెలకొల్పింది.

2016 ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో స్మృతి మంధనా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు సాధించింది. ఈ టోర్నమెంట్‌లో 192 పరుగులు చేసి తన జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో కీలకపాత్ర పోషించింది. 2013లో బంగ్లాదేశ్ పర్యటన కోసం స్మృతి మంధనా టీమిండియాలో చేరింది. 2014 లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో మంధనా 12వ తరగతి నుంచి నిష్ర్కమించింది. అలాగే హోటల్ మేనేజ్‌మెంట్ చదవాలనే కోరికను కూడా వదులుకోవాల్సి వచ్చింది.

మంధనా, ఆగస్టు 2014 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో 22, 51 పరుగులతో రాణించింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో తిరుష్ కామినితో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దాంతో ఎనిమిదేళ్ల తరువాత టీమిండియా తొలిసారిగా ఇంగ్లాండ్‌ను టెస్టుల్లో ఓడించింది. భారత్ తరపున టెస్టుల్లో అర్థ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మంధనా రికార్డు నెలకొల్పింది. కాగా, షెఫాలి వర్మ ఈ రికార్డును ఇటీవలే బద్దలు కొట్టారు.

2016 లో ఆస్ట్రేలియా పర్యటనలో హోబర్ట్‌లో తొలి వన్డే సెంచరీ నమోదు చేసింది. ఇందులో 102 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అనంతరం 2017 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై రెండో వన్డే సెంచరీ సాధించి 106 పరుగులతో అజేయంగా నిలిచింది. స్మృతి ఇప్పటివరకు 59 వన్డేలు ఆడి 41.74 సగటుతో 2253 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.





























