
ముంబైకు చెందిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి ఓ ఇంటివాడయ్యాడు. కాశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్ తో సర్ఫరాజ్ ఏడడుగులు నడిచాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

సర్ఫరాజ్, రొమానా తొలిసారి ఢిల్లీలో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీరి ప్రేమకథ చిగురించింది. రొమానా ఢిల్లీలో ఎంఎస్సీ చదువుతోంది. సర్ఫరాజ్ బంధువు ఇక్కడే చదువుకుంటున్నాడు. రోమానా తన కజిన్‌తో సర్ఫరాజ్ మ్యాచ్ చూడటానికి వెళ్లినప్పుడు మొదటి సారి ఇద్దరి పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు కలిశాయి. మనసులు కూడా కలవడంతో పెళ్లి చేసుకోవాలనకున్నారు. ఇరువురి వివాహానికి కుటుంబసభ్యుల ఆమోదం లభించడంతో వివాహ వేడుకలు జరిగాయి.

క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, సికందర్ రజా, మన్‌దీప్ సింగ్, భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రమేష్ పొవార్ సర్ఫరాజ్ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

సర్ఫరాజ్ గత ఏడాది కాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని బ్యాట్ చాలా బాగుంది. కానీ ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో మాత్రం సర్ఫరాజ్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.