
CSK Injury Crisis: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు 2026 ఐపీఎల్ ప్రారంభానికి ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని సీజన్లలో సరిగ్గా రాణించలేక ఇబ్బంది పడుతున్న సీఎస్‌కే, ఈసారి ఒక బలమైన జట్టును బరిలోకి దించాలని చూసింది. కానీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందే, ఆ జట్టు స్టార్ పేసర్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు.

ఓ నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు లేదా ఆ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేదు. ఈ కారణంగా, అతను ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనలేడు.

ఎల్లిస్ లేకపోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని, అతని స్థానంలో మరొకరి కోసం అన్వేషణ ప్రారంభించామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి ఎల్లిస్ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. జనవరిలో జరిగిన బీబీఎల్‌లో గాయపడిన ఎల్లిస్, 2026 టీ20 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉన్నాడు. అతను ఆస్ట్రేలియా తరపున నాలుగు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా దేశీయ వన్డే టోర్నమెంట్ ఫైనల్‌లో ఆడిన ఎల్లిస్‌కు ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది.

2025 మెగా వేలంలో చెన్నై నాథన్ ఎల్లిస్‌ను రూ. 2 కోట్లకు జట్టులోకి తీసుకుంది. అయితే, ఎల్లిస్ గత ఐపీఎల్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడి ఒక వికెట్ తీశాడు. అయినప్పటికీ, ఫ్రాంచైజీ అతడిని అట్టిపెట్టుకుంది. కానీ ఇప్పుడు సీజన్ ప్రారంభానికి ముందే అతను మళ్లీ గాయపడ్డాడు.