
ODI World Cup 2023: 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున ఆడిన ఏడుగురు ఆటగాళ్లకు ఈసారి చోటు దక్కకపోవడం నూటికి నూరు శాతం ఖాయం. అయితే వారిలో ఒకరు మాత్రమే తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు, ఇంకా మిగిలిన ఆరుగురు రిటైర్మెంట్ ప్రకటించకున్నా రేసు నుండి నిష్క్రమించారు. వారెవరంటే..?

1. మహేంద్ర సింగ్ ధోని: 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్‌గా కనిపించిన ఎంఎస్ ధోని ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక వేళ బెన్ స్టో్క్స్ మాదిరిగా రిటైర్‌మెంట్ నుంచి తిరిగొచ్చే పరిస్థితి కూడా ధోనికి లేదు, ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత మహీ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ను ఇంకా సంపాదించలేదు.

2. శిఖర్ ధావన్: గత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున 2 మ్యాచ్‌లు ఆడిన ధావన్ మొత్తం 125 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ధావన్‌ను ఈసారి జట్టులో ఆడేందుకు పరిగణనలోకి తీసుకోరని ఇప్పటికే అంతా స్పష్టమైంది.

3. విజయ్ శంకర్: 2019 వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఆశ్చర్యకరమైన ఎంపిక విజయ్ శంకర్. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 58 పరుగులే చేసిన ఈ ఆటగాడు, 2023 మెగా టోర్నీ కోసం ఎక్కడా చర్చలో కూడా లేదు. ఇప్పటికే అతని విషయంలో టీమిండియా తలుపులు మూసుకుపోయాయి.

4. కేదార్ జాదవ్: 2019 వన్డే ప్రపంచ కప్ జట్టుకు మరో ఆశ్చర్యకరమైన ఎంపిక కేదార్ జాదవ్. ఐదు మ్యాచ్‌ల్లో జాదవ్ 80 పరుగులు మాత్రమే చేశాడు. ఆ టోర్నీ తర్వాత జాదవ్‌కు అవకాశమే దక్కలేదు.

5. భువనేశ్వర్ కుమార్: గత వన్డే ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భువీ పేరు చర్చల్లో కూడా లేనందున అతనికి 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో అవకాశం ఉండదనే చెప్పాలి.

6. రిషబ్ పంత్: 2019 వన్డే ప్రపంచకప్‌లో పంత్ 4 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేశాడు. పంత్‌కి 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం జరగకుంటే పంత్ ఈ సారి జరిగే ప్రపంచకప్ టోర్నీలో కచ్చితంగా ఉండేవాడు. కానీ పంత్ గాయం నుంచి ఇంకా కోలుకోనందున ఈ 2023 వరల్డ్ కప్ నుంచి అతను దూరంగా ఉన్నట్లే.

7. దినేష్ కార్తీక్: 2019 వన్డే ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ 2 మ్యాచ్‌ల్లో 14 పరుగులే చేశాడు. ఆ తర్వాత కూడా డీకేకి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కినా కానీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఈ సారి టోర్నీ కోసం దినేష్ కార్తిక్ పేరు కూడా చర్చల్లో లేదు.