
ముందుగా, ఒక మీడియం సైజు కొబ్బరికాయలో నుండి పచ్చి కొబ్బరిని తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సుమారు రెండు కప్పుల కొబ్బరి ముక్కలు అవసరం. వీటిని మిక్సీ జార్‌లో వేసి, రెండు యాలకులు కలిపి, ముందుగా నీరు లేకుండా మెత్తగా పొడిలా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు కలిపి, మెత్తని ప్యూరీలా మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ లేదా సన్నటి గుడ్డలో వేసి, గట్టిగా పిండి కొబ్బరి పాలను వేరు చేయాలి. పిప్పిని మళ్లీ మిక్సీ జార్‌లో వేసి, ఒక కప్పు నీళ్లు కలిపి, గ్రైండ్ చేసి, మరోసారి పాలను తీయాలి. ఇలా రెండుసార్లు పాలు తీయడం వల్ల కొబ్బరి రుచి పూర్తిగా వస్తుంది. మిగిలిన పిప్పిని పక్కన పెట్టేయవచ్చు.

ఇప్పుడు సేకరించిన కొబ్బరి పాలల్లో అర కప్పు కార్న్‌ఫ్లోర్, అర కప్పు పంచదార వేయాలి. ఒక రిచ్ రుచి కోసం రెండు టేబుల్‌స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్ ( ఇది లేకపోతే రెండు టేబుల్‌స్పూన్ల అదనపు పంచదార వేయవచ్చు). చిటికెడు ఉప్పు కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిపి, రుచి చూసి తీపిని వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి.

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, గరిటెతో ఎప్పుడూ కలుపుతూ ఉండాలి. సుమారు ఐదు నిమిషాల్లో మిశ్రమం చిక్కబడటం ప్రారంభిస్తుంది. కలపడం ఆపితే అడుగున ఉండలు కట్టే అవకాశం ఉంది. మిశ్రమం చిక్కబడిన తర్వాత, మంటను తగ్గించి (లో ఫ్లేమ్), మరో పది నుండి పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. మొత్తం ఉడికే ప్రక్రియకు పదిహేను నుండి ఇరవై నిమిషాలు పడుతుంది. ఈ దశలో యాలకులు వేయకపోతే వెనిలా ఎసెన్స్ కలపవచ్చు.

స్టవ్ ఆపి వెంటనే, ముందుగా నెయ్యి లేదా నూనెతో గ్రీజ్ చేసుకున్న కేక్ టిన్, స్టీల్ గిన్నె లేదా గాజు బౌల్‌లోకి ఈ వేడి మిశ్రమాన్ని పోయాలి.మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచడానికి బయటే వదిలేయాలి. చల్లారిన తర్వాత, రెండు నుండి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి జున్ను గట్టిగా సెట్ అవుతుంది. గట్టిగా సెట్ అయిన తర్వాత, అంచులని ఒక కత్తితో లేదా చేతితో కొద్దిగా వదులు చేసి, ఒక ప్లేట్‌ను దానిపై బోర్లించి తిప్పితే సులభంగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిని నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి వడ్డించవచ్చు.ఈ కొబ్బరి జున్ను చాలా సులభంగా, త్వరగా తయారుచేయగల రుచికరమైన డెజర్ట్. ఈసారి మీ ఇంట్లో ఈ పద్ధతిలో కొబ్బరి జున్నుని తయారుచేసి, మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.