సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం ఎవరెస్ట్ మాదిరి కనిపిస్తుంది అందరికీ. అక్కడున్నది మహేష్ బాబు, త్రివిక్రమ్ కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవాలన్నా కూడా చాలా కష్టం. అందులోనూ మహేష్ బాబు సినిమాతో పోటీ అంటే చిన్న విషయం కూడా కాదు.
దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత కూడా డైరెక్టుగా ఇదే చెప్పుకొచ్చాడు. పండక్కి ఏ సినిమా అయితే చూడ్డానికి ప్రేక్షకులు ఎగబడతారో అది పెద్ద సినిమా.. అలా చూసుకుంటే పండక్కి మహేష్ బాబు గుంటూరు కారంపై అన్నింటికంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పోటీగా వస్తున్న హనుమాన్‌పై కూడా ఆసక్తి బాగానే ఉంది. అంచనాలు కూడా తక్కువగా ఏం లేవు.. చిన్న సినిమా కదా.. చిన్న హీరో కదా అని లైట్ తీసుకోడానికి లేదు.
ఎదురుగా మూడు భారీ సినిమాలు ఉన్నా కూడా హనుమాన్ అంత ధైర్యంగా వస్తున్నాడంటే వాళ్ల కాన్పిడెన్స్ ఏంటో అర్థమవుతుంది. థియేటర్స్ ఇష్యూ నడుస్తున్నా హనుమాన్ మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటుంది. తాజాగా వీళ్లు మరో అడుగు ముందుకేసారు.
జనవరి 12న విడుదల కానున్న హనుమాన్‌కు ముందు రోజు రాత్రే పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చూస్తున్నారు. కంటెంట్ బలంగా ఉందని నమ్ముతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్లు.
అంతేకాదు.. గుంటూరు కారం లాంటి సినిమాను ఎదుర్కోవడం అంటే మాటలు కాదు.. తొలిరోజు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. అందుకే ముందు రోజే ప్రీమియర్స్ వేస్తే వాళ్ల అదృష్టం బాగుండి పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే చాలు.. అక్కడ్నుంచి హనుమాన్ నిర్మాతలకు కంగారు పడాల్సిన పనుండదు.
మిగిలిన పనంతా ఆడియన్స్ చూసుకుంటారు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. అక్కడున్నది చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేది అస్సలు చూడరు ఆడియన్స్. ఎన్నోసార్లు ఇది ప్రూవ్ అయింది.
అందుకే హనుమాన్ సినిమాకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి ఫిక్సైపోయారు నిర్మాతలు. అయినా ఎవరు, మేజర్, బలగం, సామజవరగమనా సహా చాలా చిన్న సినిమాలకు ఈ పెయిడ్ ప్రీమియర్స్ అనేది వరంగా మారింది. వాటివల్లే సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఇదే దారిలో హనుమాన్ కూడా వెళ్తుంది.
ముందు రోజే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. నిర్మాతలు నిశ్చింతగా పడుకోవచ్చు. అప్పుడు గుంటూరు కారం ఎదురుగా ఉన్నా కూడా.. కనీసం మూడు నాలుగు రోజుల తర్వాతైన హనుమాన్‌కు థియేటర్స్ పెరగడం ఖాయం. అదే నమ్మకంతో వస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?