
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి, కానీ ఒకే నిర్మాణ సంస్థలో వరుసగా ఛాన్సులు రావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధిస్తోంది అందాల భామ మీనాక్షి చౌదరి. హారిక హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లకు ఈమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

మీనాక్షి చౌదరి ప్రయాణం సితార సంస్థతో చాలా స్పెషల్‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ బ్యానర్‌లో దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్', నవీన్ పోలిశెట్టి సరసన 'అనగనగా ఒక రాజు' చిత్రాల్లో నటించింది. ఇక హారిక హాసిని బ్యానర్‌లో మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం'లో మెరిసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సాధారణంగా ఒక సినిమాలో నటించిన తర్వాత మరో బ్యానర్‌కి వెళ్లడం సహజం. కానీ మీనాక్షి విషయంలో నాగవంశీ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆఫర్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మీనాక్షి చౌదరి సితార సంస్థలో తన ఐదో ప్రాజెక్టును కూడా ఖరారు చేసుకుంది.

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంలో మీనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో సితార సంస్థకు సూపర్ హిట్స్ అందించిన కళ్యాణ్ శంకర్, ఇప్పుడు ఈ వినోదాత్మక చిత్రంతో మరో మేజిక్ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో సైలెంట్‌గా జరిగాయని సమాచారం.

కేవలం వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా మీనాక్షి దూసుకుపోతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తోందని టాక్. ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్‌లో ఐదు ప్రాజెక్టులు అంటే, ఆ సంస్థకు ఆమె ఎంత ‘లక్కీ’ అని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో కార్తీ సినిమాతో పాటు నాగచైతన్య ‘వృషకర్మ’, హిందీలో ‘బాగమ్ భాగ్ 2’ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గ్లామర్‌తో పాటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హర్యానా బ్యూటీ, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె స్పీడ్ చూస్తుంటే మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం పక్కా అనిపిస్తోంది.