
సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేసింది. నేటికీ ఈ నటీమణుల కథలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.

అటువంటి వారిలో నటి మీనా కుమారి మొదటి వరుసలో ఉంటుంది. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న మీనా కుమారి వ్యక్తిగత జీవితం అనేక సంక్షోభాలతో నిండి పోయింది. ఆమె దర్శకుడు కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వైవాహిక జీవితంలోని ఒత్తిడి, ఒంటరితనం కారణంగా ఆమె మద్యపానానికి బానిసైంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఆమెకు లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకి మరణించింది. ఆమె మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

చాలా చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిన దివ్య భారతి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమె కీర్తి శిఖరాలను అధిరోహించారు. అయితే 1993లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందపడి ఆమె మరణించారు. అది ప్రమాదమా లేక హత్యనా అనే విషయంపై నేటికీ మిస్టురీగానే మిగిలిపోయింది. ఆమె మరణం యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది.

పర్వీన్ బాబీ తన గ్లామరస్ శైలి, ఆధునిక వ్యక్తిత్వంతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమె 2005లో ముంబైలోని ఆమె ఫ్లాట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ సమయంలో ఆమె ఒంటరి జీవితం గురించి చాలా చర్చ జరిగింది.

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో బోల్డ్ నటిగా పేరుగాంచిన సిల్క్ స్మిత 80-90వ దశకాల్లో కుర్ర కారును ఓ ఊపు ఊపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 1996లో ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు ఆమె ఓ సూసైడ్ లేఖ కూడా రాసింది.