
కుబేర ప్రీ రిలీజ్ వేడుకకు డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ ఆయనతోపాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల రష్మిక మందన్నాతోపాటు ధనుష్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ మనసులోని మాటలు బయటపెట్టారు.

తమిళంలో మీరు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని యాంకర్ సుమ అడగ్గా.. ధనుష్ మాట్లాడుతూ.. తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే డబ్బు లేకపోయినా మనకు దక్కేది ఏంటీ అని అడగ్గా అమ్మ ప్రేమ అని చెప్పారు.

తనకు రూ.150 సంపాదిస్తే రూ.200కు సమస్యలు ఉంటాయని.. కోటి సంపాదిస్తే రూ.2 కోట్లకు సమస్యలుంటాయని అన్నారు. అనంతరం కుబేర వేడుక స్టేజ్ పై డ్యాన్స్ చేసి అదరగొట్టారు ధనుష్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఆయన బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి.

కుబేర సినిమాతోపాటు ధనుష్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు దర్శకత్వం వహించిన ధనుష్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. అలాగే అబ్దుల్ కలాం బయోపిక్ కలాం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే తెలుగు , తమిళంతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు ధనుష్. ఇప్పటికే సార్ సినిమాతో నేరుగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో ప్రస్తుతం కుబేర సినిమాతో మరోసారి టాలీవుడ్ సినీప్రియులను అలరించనున్నారు.