
సినీ నటి హన్సిక మోత్వానీ కుటుంబంలో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లెక్కాయి. తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తూ, తమ ప్రతిష్టను భంగపరుస్తున్నారనే కారణంతో హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య నాన్సీ జేమ్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా హన్సిక కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన అత్తగారి ఇంట్లో గృహహింసకు గురయ్యానని, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు నెట్టింట వైరల్ కావడంతో హన్సిక ఇమేజ్‌పై ప్రభావం పడింది.

ఈ ఆరోపణలను హన్సిక వర్గం తీవ్రంగా ఖండించింది. కేవలం డబ్బు వసూలు చేయాలనే దురుద్దేశంతోనే నాన్సీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని హన్సిక కోర్టును ఆశ్రయించారు. తమ సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

సోషల్ మీడియాలో నాన్సీ పోస్ట్ చేసిన వీడియోలు తన తల్లిని, కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నాన్సీ జేమ్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. హన్సిక కుటుంబంపై ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది.

అంతేకాకుండా, ఇప్పటికే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వివాదాస్పద వీడియోలను, పోస్ట్‌లను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ కూడా ఈ విషయంలో తన చెల్లెలికి మద్దతుగా నిలుస్తూ, తన భార్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యాయపోరాటం కొనసాగుతోంది. కోర్టు తుది తీర్పు ఏమిటి? నాన్సీ జేమ్స్ దీనిపై ఎలా స్పందిస్తారు? అనేది వేచి చూడాలి.