
రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ ధరలు, ప్రత్యామ్నాయ ఇంధనాల అవసరం నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో కొత్త తరహా ఛార్జింగ్ స్టౌలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణ గ్యాస్ పొయ్యిల మాదిరిగానే కనిపించే ఈ స్టౌలు విద్యుత్‌తో ఛార్జ్ అయ్యే బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పనిచేస్తాయి. వంటకు అవసరమైన వేడిని అందించేందుకు చిన్నపాటి పుల్లలు లేదా బొగ్గులను మాత్రమే ఉపయోగించడం వీటి ప్రత్యేకత.

ఈ స్టౌలో పుల్లలు లేదా బొగ్గులు వేసి బటన్ నొక్కగానే లోపల అమర్చిన మోటార్ గాలిని పంపించి మంటను వేగంగా రగిలిస్తుంది. దీంతో పొగ తక్కువగా ఉండటంతో పాటు వంట కూడా త్వరగా పూర్తవుతుందని విక్రేతలు చెబుతున్నారు.

ఈ స్టౌలో అమర్చిన బ్యాటరీకి సుమారు మూడు గంటల పాటు ఛార్జింగ్ ఇస్తే హోటళ్లలో ఒకరోజు, సాధారణ గృహాల్లో రెండు నుంచి మూడు రోజుల వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కూలర్లలో వినియోగించే మోటార్, చిన్న బ్యాటరీతో రూపొందించిన ఈ స్టౌలు విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో తయారైన ఈ ఛార్జింగ్ స్టౌలను ఆర్మూర్‌కు చెందిన రాజు జగిత్యాలలో మంగళవారం ఒక్కోటి రూ.2,500 చొప్పున విక్రయించారు. వినూత్న సాంకేతికతతో పాటు తక్కువ ఖర్చుతో వంట చేసుకునే అవకాశం ఉండటంతో పలువురు వినియోగదారులు ఆసక్తి చూపి కొనుగోలు చేశారు.

గ్యాస్ సిలిండర్‌పై ఆధారపడకుండా తక్కువ వ్యయంతో వంట చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ తరహా స్టౌలకు మంచి ఆదరణ లభించే అవకాశముందని వ్యాపారులు భావిస్తున్నారు.