
బ్యాంకింగ్ రంగంలో 2025లో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి అనేక మార్పులు తీసుకొచ్చింది. 2026లో కూడా బ్యాంకుల్లో కొత్త రూల్స్ రానున్నాయని చెప్పవచ్చు. బ్యాంకుల టైమింగ్స్, పనివేళలు మారే అవకాశం లేకపోలేదు. ఇందుకు తగ్గట్లు ఇప్పటికే కార్యచరణ సిద్దమవుతోంది. కొత్త ఏడాదిలో మనం బ్యాంకు పనివేళలు, హాలీడేస్‌లో నూతన మార్పులు చూడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం పబ్లిక్ హాలీడేస్, ఆదివారం, రెండో, నాలుగు శనివారాల్లో బ్యాంకులన్నీ మూతపడుతున్నాయి. అయితే సాఫ్ట్‌వేర్ రంగం తరహాలో బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేసేలా మార్పులు తీసుకోవాలని, దీని వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని బ్యాంక్ యూనియన్ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం ఆందోళనలు కూడా చేయగా.. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది.

త్వరలోనే వారంలో ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. ప్రస్తుతం కేంద్ర ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 5 రోజుల పనిదినాన్ని అమలు చేయడానికి ఆర్ధికశాఖ, ఆర్బీఐ సుముఖంగా ఉన్నప్పటికీ.. దానిని అమలు చేయడానికి ఇంకా నిర్ధిష్ట కాలపరిమితి విధించుకోలేదు

ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలను అమల్లోకి తెచ్చే అవకాశముంది. ఏప్రిల్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అమలు చేయాలని భావించినప్పటికీ.. సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది.

బ్యాంకు సంఘాలు ఈ ఏడాది మార్చిలో అందించిన డేటా ప్రకారం బ్యాంకుల్లో 96 శాతం సిబ్బంది భర్తీ పూర్తయింది. దీంతో 5 రోజుల పనిదినాలను అమలు చేయడానికి అడ్డంకి తొలగిపోయినట్లేనని అంటున్నారు. 5 రోజుల పనిదినాలు అమల్లోకి వస్తే ప్రతిరోజూ బ్యాంక్ సిబ్బంది 40 నిమిషాలు అదనంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు జరుగుతాయి.