
సంక్రాంతి పండుక్కి ఇంటికెళ్లేవారితో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. పండక్కి రెండు రోజులే సమయం ఉండటంతో ఇప్పటినుంచే ఇంటి బాట పడుతున్నారు. దీంతో భాగ్యనగరం ఇప్పటినుంచే ఖాళీ అవుతోంది. అయితే సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.

ఈ క్రమంలో పండక్కి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరో మూడు స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇవి జనవరి 18 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్ల వివరాలు, షెడ్యూల్స్ ఇక్కడ తెలుసుకుందాం.

అనకాపల్లి-చర్లపల్లి(07479) ప్రత్యేక రైలు జనవరి 18న అందుబాటులో ఉంటుంది. ఇది అనకాపల్లిలో జనవరి 18న రాత్రి 10.30 గంటలకు బయల్దేరి జనవరి 19న ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-అనకాపల్లి (07477) స్పెషల్ రైలు జనవరి 19న ఉదయం 12.40 గంటలకు బయల్దేరి అదే రోజున రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.

ఇక అనకాపల్లి-చర్లపల్లి(07478) జనవరి 19న రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి నుంచి బయల్దేరనుంది. ఈ రైలు జనవరి 20వ తేదీన ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ మేరకు రైళ్ల షెడ్యూల్స్, ఎక్కడెక్కడ ఆగుతుందనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.

ఇక మరో 10 ప్రత్యేక రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 11,12,13,18,19వ తేదీల్లో ఇవి సర్వీసులు అందించనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ (07476) జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులందరూ వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే సూచించింది.