
రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలనే నిబంధన లేదు. కేవలం ఆప్షనల్ మాత్రమే. ప్రయాణికుడికి అవసరం అనుకుంటే టిక్ మార్క్ చేసి ఎంచుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ఒక్కొ ప్రయాణికుడికి 45 పైసలుగా ఉంటుంది. టికెట్ ఛార్జీలతో పాటు వీటిని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ రైలు ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు కవరేజీ ఇస్తుంది. రైల్లో ప్రయాణించేటప్పుడు ఏమైనా జరిగితే రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల బీమా కవరేజీ పొందవచ్చు. కేవలం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే ఆఫ్లైన్లో రైల్వే బుకింగ్ కౌంటర్ నుంచి టికెట్ బుక్ చేసుకుంటే ఈ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండదు.

తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 27 నుంచి కౌంటర్లో కొనుగోలు చేసిన టికెట్లకు కూడా బీమా కవరేజీ అందించాలని రైల్వే శాఖను ఆదేశించింది. రైలు ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే రైల్వే బోర్డునే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వెంటనే అమలు జరిగేలా చూడాలని ఆదేశించింది.

రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకునే టికెట్లకు కూడా బీమా కవరేజీ అందించే విషయంపై నిర్ణయం తీసుకున్నామని, సరైన గైడ్లైన్స్ రూపొందిస్తున్నట్లు మే 11వ తేదీన సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన విచారణలో అక్టోబర్ 27 నుంచి ఆన్లైన్ టికెట్ల మాదిగానే రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకునే టికెట్లకు కూడా బీమా వర్తింపచేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత రైల్వేశాఖపై ఉందని పేర్కొంది.

జూన్ 2023న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒ పిటిషన్పై విచారణ జరిగింది. కవచ్ వ్యవస్థను అన్ని మార్గాల్లో అమలు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. రైల్వే బడ్జెట్లో ప్రయాణికుల భద్రతకు కేటాయించిన నిధులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతకు సంబధించి బడ్జెట్ కేటాయింపులను కూడా పూర్తిగా వినియోగించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.