పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ ఎప్పటి నుంచో ప్రకటనలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. పలు సార్లు ఈ గడువును పొడగిస్తూ వచ్చిన కేంద్రం తాజాగా చివరి తేదీని ప్రకటించింది.
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను శాఖ తాజాగా తెలిపింది. ఇంతకు ముందు పలుసార్లు గడువును పొడగించిన ఐటీ శాఖ ఇకపై గడువు పొడగించేది లేదని అధికారులు తెలిపారు.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ కార్డుదారులు మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఏప్రిల్ 1, 2023 నుంచి పనిచేయవని పేర్కొంది.
గడువులోపు ఆధార్-పాన్ కార్డ్‌ను లింక్ చేసుకోకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ పూర్తి చేయాలని కేంద్రం చూస్తోంది.
ఇదిలా ఉంటే మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు, ప్రవాస భారతీయులు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులకు దీని నుంచి మినహాయింపు ఇస్తారు.