
ఆదాయపు పన్ను నియమాలు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల్లో భాగంగా ఉద్యోగుల అలవెన్సులు, జీతభత్యాలపై ప్రభావం పడనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ప్రయోజనాలు, హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపులు వంటివి పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను రాయితీ ప్రయోజనాల విలువ నిర్ధారణ నిబంధనల కిందకు తీసుకొచ్చింది. దీని వల్ల కంపెనీలు అందించే ఈవీ అలవెన్సులపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఈవీ వెహికల్ ఖర్చును కంపెనీ చెల్లిస్తుంటే.. నెలకు రూ.5 వేలు ప్రయోజనం లభిస్తుంది. ఇక డ్రైవర్‌కు అదనంగా రూ.3 వేల ప్రయోజనం ఉంటుంది.

ఇక వ్యక్తిగత అవసరాల కోసం ఈవీ వెహికల్ వాడుతుంటే.. మీకు రూ.2 వేల ప్రయోజనం, డ్రైవర్‌కు రూ.3 వేల ప్రయోజనం ఉంటుంది. గతంలో ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా పన్ను మినహాయింపులు నిర్ణయించేవారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇది కాస్త అర్థరహితంగా ఉండేది. ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చింది.

ఇక ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్‌లో పన్ను మినహాయింపు పరిమితి పెరగనుంది. ఇక నుంచి 50 శాతం పన్ను మినహాయింపు లభించనుంది. గతంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తా నగరాలు మెట్రో నగరాల జాబితాలో ఉండటం వల్ల హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు 50 శాతం లభించేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ చేర్చారు.

ఐటీ, వ్యాపార కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఇక నుంచి 50 శాతం హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ పొందవచ్చు. అయితే నొయిడా, గురుగ్రామ్‌లో ఉండేవారు 40 శాతం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక్కడ జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పన్ను ప్రయోజనాలు మాత్రం తక్కువగా ఉన్నాయి.