
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఆదాయపు పన్ను నియమాలు 2026తో పాన్ కార్డు వినియోగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని లావాదేవీల్లో పాన్ నంబర్ తప్పనిసరి నిబంధనలను సడలించగా, మరికొన్నింటిలో పరిమితులను పెంచారు. అలాగే పాన్ లేని వారి కోసం ఉపయోగించే ఫారం 60 స్థానంలో ఇప్పుడు కొత్తగా ఫారం 97ను ప్రవేశపెట్టారు.

ఇప్పటి వరకు ఒకే రోజులో రూ.50,000కు మించిన నగదు డిపాజిట్‌లపై పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఆ అవసరాన్ని తొలగించారు. దీంతో చిన్న, మధ్య తరహా లావాదేవీల్లో పాన్ చూపించాల్సిన ఒత్తిడి కొంత తగ్గనుంది.

అయితే మరోవైపు కొన్ని కొత్త లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది. నిపుణుల ప్రకారం, స్టాంప్ పేపర్ కొనుగోళ్లు, భారీ బీమా ప్రీమియం చెల్లింపులు, అధిక విలువ గల స్థిరాస్తి లావాదేవీలు ఇకపై తప్పనిసరిగా నివేదించాల్సి ఉంటుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షలకు మించిన స్టాంప్ పేపర్ కొనుగోళ్లు, రూ.5 లక్షలకు మించిన బీమా ప్రీమియం చెల్లింపులు ప్రత్యేకంగా పన్ను శాఖ దృష్టిలోకి రానున్నాయి.

స్థిరాస్తి రంగంలో కూడా కీలక మార్పులు చేశారు. బహుమతులు, జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు (JDA) సహా రూ.45 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు ఇకపై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. ఇంతకు ముందు ఫారం 60 సమర్పించి ఇలాంటి లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఫారం 97 అమల్లోకి రావడంతో, కంపెనీలు లేదా సంస్థలు కాకుండా వ్యక్తిగతంగా ఆస్తి కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనలతో పాన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం కాకుండా, అధిక విలువ గల లావాదేవీలపై మరింత పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పన్ను ఎగవేతను అరికట్టడం, డిజిటల్ ట్రాకింగ్‌ను బలోపేతం చేయడం కోసం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.