
Maruti Suzuki Price Hike: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. స్టీల్, అల్యూమినియం తదితర ముడి సరుకు, ఇతర వస్తువుల ధరలు (Rates) పెరిగిపోవడంతో కార్ల ధరలను పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

గత సంవత్సరం జనవరి నుంచి నాలుగు సార్లు మారుతి సుజుకి కార్ల ధరలు దాదాపు 9 శాతం పెరిగాయి. ఏడాది కాలంలో అత్యధికంగా కార్ల ధరలు పెంచిన సంస్థగా మారుతి నిలుస్తుంది. ఈ సంవత్సరం జనవరిలో అన్ని రకాల కార్ల ధరలు సగటున 1.7 శాతం పెంచేసింది.

గత సంవత్సరం ఏప్రిల్‌లో ఎంపిక చేసిన పలు మోడల్ కార్లపై 1.6, సెప్టెంబర్‌లో 1.9 శాతం పెంచింది. మారుతి కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌తోపాటు అన్ని రకాల సీఎన్జీ వేరియంట్లపై రూ.15 వేల వరకు ధర పెంచింది కంపెనీ. భారీగా పెరిగిన ముడి సరుకు ధరలతో కంపెనీ లాభాలపై ఒత్తిడి పడుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

టాటా మోటర్స్ కూడా..: టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల వాణిజ్య వాహనాలపై 2-2.5 శాతం వరకు ధర పెంచనున్నట్లు మార్చి 22న టాటా మోటార్స్ తెలిపింది. స్టీల్, అల్యూమినియంతోపాటు అరుదైన లోహాలు, ఇతర ముడి సరుకు ధరలు పెరగడంతో వాణిజ్య వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది.