
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలన్నా సెకన్లలోనే ఆన్‌లైన్‌లో పంపించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల ద్వారా నగదు సులువుగా బదిలీ చేయవచ్చు. అయితే పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు పంపితే ఐటీ నోటీసులు వస్తాయా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.

అయితే యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మార్గాల ద్వారా ఒకేసారి డబ్బులు పంపితే ఐటీ నోటీసులు అనేవి రావు. అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో ప్రకటించిన ఆదాయానికి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసిన లావాదేవీల మధ్య పొంతన లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వివరణ కోరుతుంది. ఏఐఎస్, ఫారం 26ఏఎస్ ఆధారంగా లావాదేవీల మూలాలను సరిచూసుకోవడం ద్వారా పన్ను సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే డబ్బులు, మీరు బదిలీ చేసే డబ్బులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వివరణ కోరవచ్చు. మీరు ఐటీఆర్‌లో పొందుపర్చిన వివరాలు, బ్యాంక్ లావాదేవీల మధ్య పొంతన లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. మీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఐటీ శాఖ అడగవచ్చు.

ఒకేసారి పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించినప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 285బీఏ ప్రకారం ప్రభుత్వానికి నివేదిస్తారు. ఒకేసారి నగదు డిపాజిట్ చేసినా లేదా పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా, స్తిరాస్తులు కొనుగోలు చేసినా, పెద్ద మొత్తంలో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా ఐటీ రిటర్న్స్‌లో పొందుపరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

పెద్ద లావాదేవీలు చేసినంత మాత్రాన ఐటీ నోటీసులు రావు. మీరు ఏవైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను భద్రపర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఐటీ నోటీసులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.