
ట్రైన్ల కోచ్ లోపల, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్, ప్రాంగణంలో చాలామంది ప్రయాణికులు ఎక్కడిబడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. ట్రైన్ లోపల, స్టేషన్లలో ఉండే చెత్త కుండీలను వాడుకోకుండా నచ్చినచోట చెత్త వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో చెత్త కుండీలను అందుబాటులో ఉంచిది. ఇక్కడ మాత్రమే ప్రయాణికుల చెత్త వేయాలి. మిగతా చోట్ల వేస్తే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది.

సిబ్బందికి పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.500గా ఉండగా.. ఇప్పుడు జరిమానాను రూ.వెయ్యికి పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రూ.వెయ్యి ఫైన్ స్పాట్‌లో చెల్లించాలి. లేకపోతే కోర్టుకు వెళితే రూ.2 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చెత్త, ఉమ్మి, గోడలపై రాయడం, పోస్టర్లు వేయడం చేస్తే జరిమానా విధిస్తారు.

ఇక వెండర్లు డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయకపోతే ఇప్పటివరకు ఫైన్ రూ.500గా ఉండగా.. ఇప్పుడు రూ.వెయ్యికి పెంచారు. స్పాట్‌లో కట్టకపోతే కోర్టు ద్వారా రూ.2 వేలు చెల్లించాలి. ఇక గోడలపై రాయడం, పోస్టర్లు వేయడం చేస్తే గతంలో రూ.500 ఫైన్ ఉండగా.. ఇప్పుడు రూ.వెయ్యికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్పాట్‌లో కట్టకపోతే రూ.2 వేల భారం తప్పదు.

ఈ సవరణలకు సంబంధించి రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 60 కింద ఇండియన్ రైల్వేస్ రూల్స్‌ను నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేశారు. రైలు బోగీలు, స్టేషన్ గోడలపై పోస్టర్లు, బొమ్మలు గీయడం, రైల్వే ఆస్తులను పాడు చేస్తే జరిమానా విధిస్తారు. అనుమతి లేకుండా బొమ్మలు, పోస్టర్లు లాంటివి వేయకూడదు.

రైల్వే స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేవారు, వెండర్లు ఖచ్చితంగా చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలి. రైల్వే స్టేషన్లు, కోచ్‌లలో పరిశుభ్రతను అమలు చేసేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాలను మరింత పెంచింది. దీంతో ప్రయాణికులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలి. ట్రైన్లలో వెళ్లేటప్పుడు పరిశుభ్రతను పాటించాలి.