
బ్యాంకింగ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇక నుంచి బ్యాంకులు పంపే మెస్సేజ్‌లకు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించనక్కర్లేదు. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనీ డిపాజిట్, విత్ డ్రా, ఏదైనా లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులు ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్ నెంబర్‌కు పంపుతూ ఉంటాయి. ఇందుకోసం ఖాతాదారుడి నుంచి రుసుంలు వసూలు చేస్తూ ఉంటాయి

ఇక నుంచి ఎస్‌ఎమ్‌ఎస్‌లకు ఒక్క రూపాయి కూడా ఖాతాదారులు చెల్లించనక్కర్లేదు. ఈ సర్వీసులను ఉచితంగా అందించాలని, ఖాతాదారుడి నుంచి వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత పరిమితి దాటిన లావాదేవీలకు ఎస్‌ఎంఎస్‌లు తప్పనిసరిగా పంపించాలన్న ఆర్బీఐ.. ఇందుకోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నిర్ణయతో బ్యాంకింగ్ ఖాతాదారులకు ఊరట కలిగింది.

ప్రస్తుతం ప్రతీ మూడు నెలలకు ఒకసారి బ్యాంకులు ఎస్‌ఎంఎస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను ఆటోమేటిక్‌గా కట్ చేసుకుంటాయి. బ్యాంకును బట్టి ఎస్‌ఎంఎస్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. రూ.15 నుంచి రూ.25 వరకు ఈ రుసుం ఉంటుంది. చిన్న లావాదేవీ చేసినా మెస్సేజ్‌లు పంపుతాయి. ఇక నుంచి ఉచితంగా ఈ సేవలు అందించాలని ఆర్బీఐ తెలిపింది.

బ్యాంకింగ్ నిబంధనలు, అవగాహన, క్యాంపెయిన్ కోసం పంపే ఎస్‌ఎంఎస్‌ల కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. జూన్ 24వ తేదీనే ఆర్బీఐ ఈ ఆదేశాలు ఇచ్చింది. తక్కువ మొత్తం లావాదేవీలకు సంబంధించి అలర్ట్స్ పంపాలా.. వద్దా అనేది బ్యాంకులే నిర్ణయించుకోవాలని ఆర్బీఐ తెలిపింది. ఎక్కువ మొత్తం లావాదేవీలకు ఖచ్చితంగా పంపాలని స్పష్టం చేసింది.

అయితే ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు నష్టం చేకూరనుంది. బ్యాంకులకు ఎస్‌ఎంఎస్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇప్పటివరకు 5 కోట్లుపైన కస్టమర్లు ఉన్న బ్యాంకులకు ఎస్‌ఎంఎస్ ఛార్జీల ద్వారా రూ.360 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు అది నిలిచిపోనుంది. రూ.500పైన చేసే ట్రాన్సక్షన్లకు బ్యాంకులు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ లావాదేవీలకు బ్యాంకుల పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు.