
బంగారం ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎప్పటికీ తగ్గడం లేదు. దీంతో బంగారం ధరల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నాయి. పెరగడానికి కారణాలు ఏంటనేది తెగ చర్చించుకుంటున్నారు. బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు, ప్రజలు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. గోల్డ్ రేటు వచ్చే ఏడాది ఎంత పెరుగుతుందనే దానిపై అనేక సంస్థలు తమ అంచనాలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ స్వర్ణ మండలి అంచనాలు మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి. ఆ సంస్థ నివేదిక ప్రకారం 2026లో బంగారం ధరలు జెడ్ స్పీడ్‌లో పెరగనున్నాయి.

2026లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని, ఆ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షలు దాటే అవకాశముందని అంచనా వేసింది. రూ.1.60 లక్షలు కూడా చేరుకోవచ్చని తెలిపింది. ట్రంప్ టారిఫ్‌లు, అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణమని స్పష్టం చేసింది. ఈ నివేదిక చూస్తే 2026లో బంగారం ధరలకు బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు.

ఇప్పటికే ఈ ఏడాదిలో తులం బంగారం ధర రూ.1.37 లక్షలకు చేరుకుని రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం రూ.1.30 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర ఏకంగా 2 లక్షల మార్క్‌కు చేరుకుంది. రానున్న రోజుల్లో బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరగనుంది. ఇప్పటికే వెండి ధర రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది.

1979లో 120 శాతం పెరుగుదల నమోదు చేసిన బంగారం.. ఈ ఏడాది 70 శాతంపైనే పెరిగింది. 2024 డిసెంబర్ 31న రూ.78,950గా ఉన్న తులం బంగారం 2025 ఏప్రిల్ నాటికి రూ.లక్షకు చేరుకుంది., డిసెంబర్ 15 నాటికి రూ.1,37,600కి చేరుకుంది. ఈ ఏడాది బంగారం ధర రూ.58,650 పెరిగింది.