
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ నగదు అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బ్యాంకులు, NBFCలు త్వరగా రుణం మంజూరు చేయడంతో ఇది సులభ మార్గంగా కనిపిస్తున్నా, కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొదటగా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పోల్చాలి. ఒక్కో బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థలో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు భిన్నంగా ఉంటాయి. తక్కువ వడ్డీ కనిపించినా హిడెన్ ఛార్జీలు ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. వార్షిక శాతం రేటు (APR) ఎంత అవుతుందో లెక్కించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని గమనించాలి. సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని ఎవరైనా చెబితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంగారం తూకం, శుద్ధతను మీ సమక్షంలో పరీక్షిస్తున్నారా లేదో చూసుకోవాలి. ఇక రీపేమెంట్ నిబంధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వడ్డీని నెలనెలా చెల్లించాలా, లేక చివర్లో మొత్తంగా చెల్లించాలా అనే విషయాన్ని తెలుసుకోవాలి. గడువు దాటితే పీనాల్టీ ఎంత ఉంటుందో కూడా ముందుగానే తెలుసుకోవడం అవసరం.

అత్యంత ముఖ్యంగా రుణం తీసుకున్న తర్వాత బంగారం భద్రతపై బ్యాంక్ లేదా NBFC విధానాన్ని తెలుసుకోవాలి. బీమా కవరేజ్ ఉందా? లాకర్ భద్రత ఎలా ఉంటుంది? వంటి అంశాలను నిర్ధారించుకోవాలి. చివరగా గడువులోపు రుణం తీర్చలేకపోతే బంగారం వేలానికి వెళ్లే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

కాబట్టి అవసరమైనంత మాత్రమే రుణం తీసుకుని, చెల్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి గోల్డ్ లోన్ తక్షణ అవసరాలకు ఉపయోగకరమైన ఆర్థిక సాధనం అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అది నిజమైన ఉపశమనంగా మారుతుంది.