జర్మన్ కార్ల కంపెనీ BMW వచ్చే నెల అంటే ఏప్రిల్ నుండి భారతదేశంలో తన కార్ల ధరలను పెంచబోతోంది. ఈ ధరల పెరుగుదల BMW, MINI కార్లు రెండింటికీ వర్తిస్తుంది. రెండు బ్రాండ్లు BMW గ్రూప్ కిందకు వస్తాయి. భారతదేశంలో కంపెనీ లైనప్‌లో ఉన్న అన్ని వాహనాల ధరలు 3 శాతం పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
పెరిగిన ధర మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. భారతదేశంలో అనేక BMW కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో BMW 2 సిరీస్ నుండి BMW XM వరకు ఉన్నాయి. మరోవైపు, MINI శ్రేణిలో కూపర్ S మరియు కొత్త తరం కంట్రీమ్యాన్ ఉన్నాయి.
ధరల పెరుగుదలకు గల కారణాన్ని బీఎండబ్ల్యూ వెల్లడించలేదు. కానీ వాహన తయారీదారు నిర్ణయం వెనుక పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు ఒక ముఖ్య కారణం కావచ్చు. ముఖ్యంగా, మ్యూనిచ్‌కు చెందిన ఆటోమేకర్ కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరలను పెంచిన మొదటి లగ్జరీ కంపెనీ. ఇప్పటివరకు మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా, హ్యుందాయ్ వంటి ప్రధాన ఆటో తయారీదారులు ఏప్రిల్ నుండి తమ తమ మోడల్ శ్రేణులలో ధరల పెంపును ప్రకటించాయి.
భారతదేశంలో BMW విస్తృత శ్రేణి కార్లను అమ్మకానికి ఉంచిందిజ ఇందులో స్థానికంగా అసెంబుల్ చేయబడిన, పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడళ్లు ఉన్నాయి. BMW 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ LWB, 5 సిరీస్ LWB, 7 సిరీస్, X1, X3, X5, X7, M340i మరియు iX1 LWB అన్నీ స్థానికంగా అసెంబుల్ చేయబడిన మోడళ్లు. మరోవైపు, BMW i4, i5, i7, iX, Z4 M40i, M2 కూపే, M4 కాంపిటీషన్, M4 CS, M5, M8 కాంపిటీషన్ కూపే, XM హైబ్రిడ్ SUV లు పూర్తిగా నిర్మించిన యూనిట్లుగా (CBU) భారతదేశానికి వస్తాయి. కూపర్ ఎస్, పూర్తి-ఎలక్ట్రిక్ కంట్రీమ్యాన్‌లను కలిగి ఉన్న మినీ శ్రేణి కూడా పూర్తిగా దిగుమతి చేయబడింది. భారతదేశంలో BMW కార్ల ధరలు రూ.43.90 లక్షల నుండి రూ.2.60 కోట్ల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. 3 శాతం చొప్పున, అత్యంత ఖరీదైన కార్ల ధరపై రూ.7 లక్షలకు పైగా పెరుగుతుంది.
ఈ త్రైమాసికంలో బీఎండ్ల్యూ మూడు కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది. కొత్త తరం BMW X3 ప్రారంభ ధర రూ. 75.80 లక్షలకు, భారతదేశానికి ప్రత్యేకమైన iX1 LWB ఆకర్షణీయమైన ధర రూ. 49 లక్షలకు విడుదలైంది. చివరగా, కొత్త MINI కూపర్ S జాన్ కూపర్ వర్క్స్ (JCW) వేరియంట్ రూ. 55.90 లక్షల ధరకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) విడుదలైంది. ఈ మూడు మోడళ్లను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించారు. కొత్త X3, iX1 LWB డెలివరీలు సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. అయితే వినియోగదారులు ఏప్రిల్ నుండి MINI కూపర్ S JCWని పొందుతారు.