
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, గల్ప్ దేశాలపై ఇరాన్ వరుస దాడుల ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ద వాతావరణం క్రమంలో సరుకు రవాణాకు అంతరాయం కలగడంతో దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. గ్యాస్ బండ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్స్ మూతపడ్డాయి. దీంతో ఆహార పదార్దాల ధరలు కూడా పెరిగిపోవడం సామాన్యులకు భారంగా మారుతోంది.

టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టిఫిన్ ధరలను పెంచగా.. మిగతా ఆహార పదార్థాల ధరలను కూడా నిర్వాహకులు పెంచేశారు. పెరిగిన ధరలతో సామాన్యుల జేబుకు చిల్లులు పడతుండగా.. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని వేగవంతం చేసింది.

హోటల్స్ నిర్వాహకుల సమస్యను తీర్చేందుకు వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేటాయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల హోటల్స్‌కు గ్యాస్ అందనుంది.

దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార పరిశ్రమ దెబ్బతినకుండా రెస్టారెంట్లు, హోటల్స్‌కు తొలి ప్రాధాన్యతగా గ్యాస్ సరఫరా చేయనుంది. ఇక పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, కమ్యూనిటీ కిచెన్లకు గ్యాస్ అందించేందుకు సిద్దమైంది. అయితే ఈ అదనపు గ్యాస్ కేటాయింపులు పొందాలనుకునేవారికి కేంద్రం నిబంధనలు విధించింది.

ఈ అదనపు గ్యాస్ కేటాయింపులు పొందాలంటే నిర్వాహకులు ఆయిల్ కంపెనీల వద్ద నమోదు చేయించుకోవాలి. ఇక పీఎన్జీ కనెక్షన్ కోసం తప్పనిసరిగా రదఖాస్తు చేసుకుని ఉండాలి. దీర్ఘకాలంతో హోటల్స్‌కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.