
వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌కు అతి చేరువలో ఉంటుంది. ఇక్కడి పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. నిన్న మొన్నటి ఒత్తిడినంత పక్కకు నెడుతూ ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతారు.. అంత బాగుంటుంది ఈ ప్రాంతం.

అయితే, ఈ అనంతగిరి కొండలకు ఆ శ్రీ మహా విష్ణువుకు దగ్గరి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నారు. తిరుమల కొండలతో పోల్చితే అనంతగిరి కొండలు చాలా చిన్నవి. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమనీ, కర్నూలు జిల్లాలోగల అహోబిలం కొండలు మధ్యభాగమని, అనంతగిరి కొండ తోక భాగమని చెబుతుంటారు. ఇకపోతే, కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల 'అనంత పద్మ నాభస్వామి ఆలయం' అందరినీ ఆకర్షిస్తోంది.

ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంటుంది.. అక్కడికి వెళ్లడానికి సుమారు వందమెట్లు దిగి వెళ్లాలి. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా మొదలై హైదరాబాద్ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

సెలవులు, వీకెండ్ రోజుల్లో అనంతరగిరికి వచ్చే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుండి 80 కి.మీ దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ స్వర్గం కంటే అందంగా ఉంటుంది. కులు-మనాలీ అందం కూడా అనంత గిరుల ముందు మసకబారుతుందని చెప్పాలి.

మూసి నది అనంతగిరి కొండల నుండి ఉద్భవించింది. దాని అందం అద్భుతంగా ఉంది. దీన్ని చూడటానికి చాలా దూరం నుండి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్లు ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కొండ ప్రాంతం సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది.