“కర్నూల్” కి 80 కిలోమీటర్ల దూరం లో ఉన్న “బనగానపల్లి” వెళ్తే అక్కడే కనపడుతుంది ఈ కోట బంగ్లా.. బనగానపల్లె మండలంలోని పాతపాడు గ్రామ సమీపంలోని బనగానపల్లి కోట అలియాస్ పాతపాడు నవాబ్ బంగ్లా .. యాగంటి వెళ్ళే మార్గంలో ఉంది. ఈ కోట ఒక పెద్ద కొండమీద అందంగా, రాజమహల్ ని తలపించేలా ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ.. అక్కడున్న ప్రజలు దీనిని తన ప్రియురాలికి కోసం కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది .అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు.
ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెద్ద హాలు, కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లన దీనిని అరుంధతి కోట గా ఇక్కడి ప్రజలు పిలిచుకుంటారు.
యాగంటి మార్గంలో గల చిన్న కొండపై 400 ఏళ్ళనాడు బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన అందమైన భవంతి సైతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈరోజుకీ అక్కడికి వచ్చి ఆ కోటంతా తిరిగి చూసి కాసేపు గడిపేవాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ మంచి టూరిస్ట్ ప్లేసులలో ఒకటి.
1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్ ఆలీ ఖాన్ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్ ఆలీ మేనమామ, ముబారిజ్ ఖాన్ దయవల్ల ఫైజ్ ఆలీ ఖాన్ స్థానం పదిలంగానే ఉంది.
అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్ ఆలీ ఖాన్ బనగానపల్లెకు ప్రభువయ్యాడు.
అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.
1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది. మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి. .
1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది. మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి. అలాంటి నవాబ్ బంగ్లా లోపలి భాగం శిథిల వస్తకు చేరింది. పర్యాటకుల కోసం బంగ్లాని తక్కువ వ్యయంతో నైనాసరే మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.
నవాబ్ బంగ్లా కాస్త అరుంధతి బంగ్లా గా మారింది. అయితే ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంటుంది. ఈ బంగ్లా నిర్వహణ ప్రస్తుతం నవాబు వారసుల చేతుల్లో ఉంది. చారిత్రక కట్టడమైన ఈ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుంది దని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన యాగంటి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాగంటి కొచ్చే భక్తులు కచ్చితంగా ఈ బంగ్లాను దర్శిస్తుంటారు. ఈ బంగ్లాను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే ఆదాయం తో పాటు చారిత్రక కట్టడాన్ని నిలుపుకున్న వాళ్ళం అవుతాం .. లేకపోతే ఈ బంగ్లా తో పాటు ఈ ప్రాంత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో ఉందని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.