
ఈ మధ్యకాలంలో చాలామంది హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటనలు వెలుగు చూసాయి. అలాగే మరికొందరు వ్యాయామాలు చేస్తూ కూడా అకస్మాత్తుగా పడిపోయారు. ఇందుకు ముఖ్య కారణం గుండె మీద ఒత్తిడి, భారం పెరగడమే.

వేగంగా వ్యాయామాలు చేసేటప్పుడు గుండె మరింత బలంగా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేస్తుంది. దీనివల్ల గుండెమీద ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా గుండె స్తంభించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదటిది శక్తికి మించి వ్యాయామాలు చేయకూడదు. ఒకేసారిగా తీవ్రంగా చెయకూడదు. వ్యాయమాలను నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి ఫిట్‌గా ఉన్నారో లేదో అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.

తమ కుటుంబ సభ్యు్ల్లో ఎవరికైనా గుండెపోటు వచ్చినా లేక గుండె జబ్బు ముప్పు పొంచి ఉంటే వ్యాయామాలు చేయడానికి ముందే గుండె వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే ఒంట్లో నీటి శాతం కూడా తగ్గకుండా చూసుకోవాలి.

వ్యాయామాలు చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నీళ్లు తాగాలి. వ్యాయామాలు ఎప్పుడు ఆపివేయాలో కూడా తెలిసి ఉండాలి. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత అస్సలు వ్యాయామాలు చేయకూడదు. మరో ముఖ్య విషయం స్టిరాయిడ్లు అసలు వాడకూడదు.