
కావలసిన పదార్థాలు: అరకిలో కూడిన బోన్ చికెన్, చికెన్ ఉడకడానికి నీళ్లు, ఉల్లిపాయలు, 2 నాటు టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 రెమ్మల తాజా కరివేపాకు, కాడలతో సహా కొద్దిగా తాజా కొత్తిమీర, వంట నూనె, స్పెషల్ రసం మసాలా పేస్ట్ కోసం: 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 నుండి 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ నల్ల మిరియాలు, 2 స్పూన్ల పచ్చి కందిపప్పు, 1 చిటికెడు మెంతులు, 1 అంగుళం ముక్క అల్లం, దాల్చినచెక్క – 1 చిన్న ముక్క, లవంగాలు – 2 , 1 వెల్లుల్లి పూర్తి పాయ చివరి తాలింపు కోసం: ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఎండుమిర్చి – 1

తయారీ విధానం: స్టవ్‌పై ప్రెజర్ కుక్కర్ పెట్టి 1 స్పూన్ నూనె వేడిచేయాలి. ఇందులో దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి. శుభ్రం చేసిన అరకిలో బోన్ చికెన్, పావు స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి నూనెలో 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి తునకలు, సగం ఉల్లిపాయ ముక్కలు, 1 కట్ చేసిన టొమాటో, కొత్తిమీర కాడలు వేసి చికెన్ 50% మగ్గే వరకు కలపాలి.

ఇందులో సరిగ్గా 1 లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు, 2 స్పూన్ల కందిపప్పు వేసి మొదట పొడిలా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో 1 అంగుళం అల్లం ముక్క, 1 వెల్లుల్లి గడ్డ రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టొమాటో, మిగిలిన సగం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి కచ్చాపచ్చాగా (కోర్స్‌గా) రుబ్బుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. ఇందులో చిన్న దాల్చినచెక్క, 2 లవంగాలు వేసి.. గ్రైండ్ చేసిన మసాలా ముద్ద, కరివేపాకు వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మసాలా పచ్చివాసన పోయి అంచుల నుండి నూనె వేరయ్యే వరకు నిదానంగా కలుపుతూ వేయించాలి. ఇందులో పావు స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. మసాలా వేగిన తర్వాత.. కుక్కర్లో మెత్తగా ఉడికిన చికెన్ ముక్కలను నీళ్లతో (సూప్‌తో) సహా కడాయిలోకి పోసి బాగా కలపాలి.

రసం మరుగుతున్నప్పుడు నానబెట్టిన చిన్న నిమ్మకాయంత చింతపండు రసాన్ని పోయాలి. ఉప్పు సరిచూసి, అవసరమైతే అదనపు ఘాటు కోసం మరో అర స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి. మీడియం మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు రసం తెర్లేలా బాగా మరిగించాలి. చిన్న పాన్‌లో 1 స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి. ఈ వేడి తాలింపును మరుగుతున్న చికెన్ రసంలో పోసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే, నోరూరించే ఘాటైన 'ఆంధ్రా చికెన్ రసం' సిద్ధం! మెత్తగా వండిన వేడివేడి అన్నంలోకి ఈ రసాన్ని పోసుకుని తింటుంటే మిరియాల ఘాటు, చికెన్ ఎముకల సారం, చింతపండు పులుపుతో కలగలిసి అన్నం మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది; గ్లాసులో పోసుకుని సిప్ చేస్తూ తాగితే గొంతుకు అమితమైన సాంత్వన లభిస్తుంది!