
కొర్రమీను (ముర్రెల్).. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న చేపల్లో కొర్రమీను ముందుంటుంది. ముర్రెల్‌ను తెలంగాణ రాష్ట్ర చేపగా కూడా పేర్కొంటారు. ఈ చేప మాంసం మెత్తగా, ప్రత్యేకమైన రుచితో పాటు ముళ్లు తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. అందుకే ఫ్రై, కర్రీ రెండింటికీ ఇది మంచి ఎంపిక.

రోహు చేప.. రోహు చేపను ఏపీ, తెలంగాణలో విస్తృతంగా తింటారు. కర్రీ, ఫ్రై, పులుసు వంటి వంటకాల్లో రోహు రుచి బాగా ఉంటుంది. హైదరాబాద్‌లో చేపల వినియోగదారుల అధ్యయనంలో రోహు మొదటి స్థానంలో నిలవడం దీని ప్రజాదరణకు నిదర్శనం.

కట్లా చేప.. కట్లా లేదా బొచ్చ చేప పెద్ద ముక్కలుగా లభించడం, కర్రీలో మంచి రుచి రావడం వల్ల చాలామందికి ఇష్టమైన చేప. తెలంగాణలో కూడా కట్లా, రోహు వంటి చేపలు సాధారణంగా లభిస్తాయి.

వంజరం/కొనేమ (సీర్ ఫిష్).. సముద్ర చేపల్లో వంజరం లేదా కొనేమకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఇది ముఖ్యమైన వాణిజ్య చేపగా లభిస్తుంది. ముక్కలు పెద్దగా ఉండటం, ఫ్రై చేసినప్పుడు మంచి రుచి రావడంతో చేపల ప్రియులు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.

పండుగప్ప (సీబాస్).. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో లభించే మరో రుచికరమైన చేప పండుగప్ప. సీబాస్‌గా పిలిచే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫ్రై, గ్రిల్, కర్రీ వంటి వంటకాలకు ఉపయోగించవచ్చు.