
అయితే ప్రస్తుతం ఆ భారీ గంటలు కనుమరుగు అయిపోయాయి. కానీ ఒక ఊరిలో ఇప్పటికీ రాజుల కాలంలోని 400 కిలలో ఉన్న భారీ గంట ఉంది. కాగా ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

సమాచారాన్ని నిమిషాల్లో వేలాది మందికి చేరవేసేందుకు నేడు మైకులు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, సైరన్లు ఉన్నాయి. కానీ, దాదాపు 500 ఏళ్ల క్రితం విజయనగర రాజుల కాలంలో ఊరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు, హెచ్చరించేందుకు ఏం వాడేవారో తెలుసా? అదే.. ఈ 400 కిలోల భారీ 'ధర్మగంట'!

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులోని అతి పురాతన సోమేశ్వర ఆలయంలో కొలువుదీరిన ఈ ధర్మగంట వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొత్తచెరువు కట్ట నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏర్పాటు చేసిన ఈ గంట, అప్పట్లో ఒక శక్తివంతమైన సమాచార సాధనంగా పనిచేసింది.

ఈ గంట మోగితే చాలు,ఏకంగా 3 కిలోమీటర్ల మేర దద్దరిల్లిపోయేది!.చెరువు కట్ట నిర్మాణంలో పనిచేసే వేలాది మంది కూలీలకు పనివేళలు, భోజన విరామాలు తెలియజేయాలన్నా..వర్షాకాలంలో చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించి ఊరికి ప్రమాదం పొంచి ఉంటే రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలన్నా..చివరకు కరవు కాటకాల సమయంలో మఠాధిపతులు గంజి పంపిణీకి శ్రీకారం చుట్టినప్పుడు ఊరందరికీ కబురు అందించాలన్నా.. ఈ ధర్మగంటే ఏకైక ఆధారమయ్యేది.

ఒకప్పుడు ఎత్తైన స్తంభాలపై కొలువుదీరి ప్రత్యేక ఏర్పాట్లతో మోగే ఈ గంట, ఇప్పటికీ విజయనగర రాజుల శిల్పకళా వైభవానికి, సాంకేతిక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటు పుట్టపర్తికి అత్యంత సమీపంలో ఉన్న ఈ సోమేశ్వర ఆలయంలో.. హరిహర స్వరూప దర్శనంతో పాటు, ఈ చారిత్రక ధర్మగంటను తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.