ఆవిషయం మోదీ, నిర్మలకు తప్ప అందరికీ తెలుసు

భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం ప్రధానమంత్రి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసునని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు.

ఆవిషయం మోదీ, నిర్మలకు తప్ప అందరికీ తెలుసు
Follow us

|

Updated on: Sep 01, 2020 | 2:06 PM

భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం ప్రధానమంత్రి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసునని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. దేశ జీడీపీ దారుణంగా పడిపోవడానికి మోదీ సర్కారు అసమర్థతే కారణమన్నారు. జీఎస్టీ పరిహార అంశంలో కేంద్రానికి ఎదురు నిలిచిన పంజాబ్, ఛత్తీస్‌గడ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ,ఢిల్లీ రాష్ట్రప్రభుత్వాల్ని చిదంబరం అభినందించారు. మూడు రోజుల కిందట వెలువడిన ఆర్బీఐ వార్షిక నివేదిక ఏం జరుగబోతోందో ముందే చెప్పిందన్న చిదంబరం.. మోదీ సర్కారు నిర్లక్ష్యానికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుపేదలు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయారన్నారు.

కేవలం వ్యవసాయం, అటవీ, మత్స్యశాఖల్లో మాత్రమే 3.4 శాతం వృద్ధిరేటు నమోదైందని.. అయితే, వ్యవసాయం విషయంలో ప్రభుత్వానికేమీ సంబంధం లేదని ఆయన అన్నారు. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ప్రభుత్వం వదిలేసింది.. రైతులను దేవుడే కాపాడుతున్నాడని చెప్పారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టు ఈ ఆర్ధిక సంక్షోభానికి భగవంతుడి చర్యలే కారణమైతే, వ్యవసాయాన్ని రక్షించినందుకు మనం ఆ దేవుడికి కృతజ్జతలు తెలపాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క వ్యవసాయ రంగం తప్ప కొవిడ్ నేపథ్యంలో తయారీ, నిర్మాణ, వ్యాపార, హోటల్‌ రంగాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని ఆయన అన్నారు.