Rahul Gandhi: వరుసగా సంభవిస్తున్న సానుకూల సంకేతాలు, ఫలితాల కారణంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో కొత్త జోష్ కనిపిస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నిర్వహించిన భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. జోడో యాత్ర తర్వాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే దక్కుతుందన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. దేశంలో రాజకీయాలను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా చూడాల్సి వుంది. కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పెద్దన్న పాత్రను పోషించేందుకు ధైర్యం చేసింది. కర్నాటక ఎన్నికలకు ముందు నుంచి దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఒక్కతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఓవైపు నితీశ్, ఇంకోవైపు కే.చంద్రశేఖర్ రావు బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒక గొడుగు కిందికి తేవాలని కర్నాటక ఎన్నికల కంటే ముందు నుంచే ప్రయత్నిస్తున్నారు. నితీశ్ సారథ్యంలో కొనసాగిన ప్రయత్నాలలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా వుండగా.. కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి యత్నాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకు కారణం కేసీఆర్ తన రాష్ట్రంలో ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోరాడుతోంది. ఈ సంవత్సరాంతంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటి దాకా కాంగ్రెస్ పార్టీతో పోరాడడమే కేసీఆర్‌కు కావాలి. నితీశ్ ప్రతిపాదించిన కూటమిలో పెద్దన్న పాత్రను వదులుకునేందుకు, ప్రధాని అభ్యర్థిని ఏకపక్షంగా కాకుండా ఉమ్మడిగా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కాంప్రమైజ్ అయ్యారు. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతల తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. కర్నాటక తరహాలోనే దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్న విశ్వాసం ఆ పార్టీ నేతల్లో పెరిగింది. దానికి రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రనే ప్రధాన కారణమని కాంగ్రెస్ నేతలు భావించడం మొదలైంది కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాతనే. అప్పటి వరకు మోదీ చరిష్మాతో పోలిస్తే రాహుల్ గాంధీ ఎక్కడో వున్నారని అనుకున్న వారిలో చాలా మంది మోదీకి ఎంతో కొంత ధీటైన క్యాండిడేట్ రాహులేనన్న అభిప్రాయానికి వచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి రేసులోకి వచ్చింది. నితీశ్ ప్రతిపాదించిన కూటమిలో ఓ పాత్రధారిగా కాకుండా సూత్రధారి కావాలన్న దిశగా వ్యూహాన్ని మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. పాట్నాలో జరిగిన తొలి విపక్ష కూటమిలో సాదాసీదాగా పాల్గొన్న కాంగ్రెస్ నేతలు.. మలి భేటీ జరిగిన బెంగళూరుకు ఏకంగా సోనియా గాంధీని వెంటేసుకుని వచ్చారు. తమది పెద్దన్న పాత్ర అని చాటేందుకు విపక్ష కూటమి అధినేతలకు లావిష్ విందును ఏర్పాటు చేశారు. సమావేశాల రెండో రోజు కూటమి భేటీని పూర్తిగా నిర్వహించి, తామే కూటమి సారథి అని పరోక్షంగా చాటారు. విపక్ష కూటమికి తాము ప్రతిపాదించిన I.N.D.I.A. పేరు పెట్టేలా చూసుకున్నారు కాంగ్రెస్ నేతలు. విపక్ష కూటమి మూడో సమావేశాన్ని ముంబైలో నిర్వహించాలని బెంగళూరులోనే నిర్ణయించారు. తాజాగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో విపక్ష కూటమి మూడో భేటీ నిర్వహించాలని తేదీలను కూడా ఖరారు చేశారు.
తాజాగా విపక్ష కూటమి తరపున కాంగ్రెస్ సారథ్యంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీనే ప్రతిపాదించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. తాజాగా దానిపై సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఇది పక్కన పెడితే, తాజాగా రాహుల్ గాంధీకి అనుకూలంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సభలో అడుగుపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయనే ప్రారంభిస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో వ్యూహాత్మకంగా తాను ముందుగా మాట్లాడకుండా తీర్మానాన్ని ప్రతిపాదించిన గౌరవ్ గగోయ్‌కే ముందుగా మాట్లాడే అవకాశమిచ్చారు. అయితే, తీర్మానంపై జరిగిన చర్చలో రెండో రోజు ప్రసంగించిన రాహుల్ గాంధీ తాను పరిణితి చెందిన రాజకీయ నేతనని చాటుకునేలా ప్రసంగించేందుకు యత్నించారు. ఆయన ఎలా ప్రసంగించారన్నది పక్కన పెడితే రాహుల్ గాంధీ హావభావాలలో ఆత్మ విశ్వాసం తొణికసలాడుతోంది. ఉత్సాహం కూడా ఇనుమడించినట్లు కనిపిస్తోంది. తన సభ్యత్వం రద్దైనా తాను క్షమాపణ చెప్పబోనని చాలా సార్లు ఆయనన్నారు. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న విశ్వాసం ఆయనలో మొదట్నించి కనిపించింది. రాహుల్ గాంధీకి రెండేళ్ళ శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించడంతో ఆయన కాలరెగరేసుకుని మరీ లోక్‌సభకు హాజరయ్యారు. ఓవరాల్‌గా చూస్తే రాహుల్ గాంధీలో ఈ మార్పు ఆయన కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా చేసిన భారత్ జోడో పాదయాత్ర ద్వారానే వచ్చిందని చెప్పాలి. పాదయాత్రలో తాను చేసినట్లే కర్నాటక ఎన్నికల్లోను సమాజంలో కింది స్థాయి వ్యక్తులను నేరుగా కలిసే పంథాను రాహుల్ గాంధీ కొనసాగించారు. టూ వీలర్లపై ప్రయాణం చేశారు. వివిధ వృత్తులను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వారితో మాటామంతీ కొనసాగించారు. అది సత్ఫలితమిచ్చిందని భావిస్తున్న రాహుల్ గాంధీ ఇపుడు మరోసారి భారత్ జోడో యాత్రను చేపట్టందుకు రెడీ అవుతున్నారు. రెండో విడత పాదయాత్రను గుజరాత్‌లో ప్రారంభించి ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయలో ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈసారి ఆయన యాత్ర మరింత వ్యూహాత్మకంగా వుండబోతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మణిపూర్ అంశం చర్చనీయాంశమైంది. పార్లమెంటును ఇదే అంశం స్తంభింప జేసింది. విపక్ష కూటమి మణిపూర్ అంశాన్ని మరింతగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకు వెళ్ళాలని భావిస్తోంది. అందుకే రెండో విడత పాదయాత్రలో రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాలలను ఎంచుకున్నట్లు బోధపడుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, యుపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్ గుండా సాగి అసొం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో రాహుల్ గాంధీ భారత్ జోడో రెండో విడత పాదయాత్ర కొనసాగబోతున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలల గడువుంది. ఈలోగా మరో విడత పాదయాత్రను పూర్తి చేయడం ద్వారా తన చరిష్మాను మరింతగా పెంచుకోవాలన్నదే రాహుల్ వ్యూహమని బోధపడుతోంది.