ఎన్‌డీఏకు అందని ‘మ్యాజిక్ ఫిగర్’.. లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు.

ఎన్‌డీఏకు అందని ‘మ్యాజిక్ ఫిగర్’.. లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
Women's Quota Push Fails

Updated on: Apr 17, 2026 | 8:06 PM

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందడానికి ఎన్‌డీఏ ప్రభుత్వానికి 326 ఓట్లు అవసరం కాగా, కేవలం 278 ఓట్లు మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 211 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. జనాభా గణన ప్రక్రియను దాటవేసి పునర్విభజన చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి ఈ ఫలితం గట్టి విఘాతంగా మారింది. దీంతో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది.

దేశ రాజకీయ చరిత్రలో పెను మార్పులు తీసుకువస్తుందని భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) పార్లమెంట్‌లో చతికిలపడింది. మూడు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం జరిగిన ఓటింగ్ ఫలితం మహిళా లోకానికి నిరాశనే మిగిల్చింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడి ఉన్న ఈ కీలక బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన వివరాల ప్రకారం.. సభలో మొత్తం 528 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే కనీసం 352 ఓట్లు (2/3 వంతు) అనుకూలంగా రావాల్సి ఉండగా, కేవలం 298 ఓట్లు మాత్రమే మహిళా బిల్లుకు అనుకూలంగా పడ్డాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదయ్యాయి. అంటే, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 54 ఓట్ల దూరంలో బిల్లు ఆగిపోయింది. తొలి రౌండ్‌లోనూ 489 ఓట్లు పోలవగా, అక్కడ కూడా 278 ఓట్లతో మెజారిటీని అందుకోలేకపోయింది.

మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఈ బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ఈ బిల్లులోని నిబంధనలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని బిల్లుతో లింక్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియోజకవర్గాల పునర్విభజన ఆవశ్యకతను గట్టిగా వినిపించారు. “ప్రస్తుతం ఒక ఎంపీ నియోజకవర్గంలో 60 వేల మంది ఓటర్లు ఉంటే, మరొక చోట 49 లక్షల మంది ఉన్నారు. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు ఎంపీలు తమ ఓటర్లకు న్యాయం చేయడం అసాధ్యం” అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కాలానుగుణంగా పునర్విభజనకు అవకాశం కల్పిస్తోందని, ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ఒక బూటకపు బిల్లుగా అభివర్ణిస్తూ, మహిళలకు అధికారం కల్పించడం కంటే ఎన్నికల మ్యాప్‌ను మార్చే రాజకీయ వ్యూహం దీని వెనుక ఉందని ఆరోపించారు. “2023లో బిల్లు తెచ్చినప్పుడే అమలుకు ఏళ్లు పడుతుందని చెప్పారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది” అని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం దీనిని మహిళా సాధికారతకు వేసిన పునాదిగా అభివర్ణిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం దీనిని రాజకీయ లెక్కలతో కూడిన వ్యవస్థాగత మార్పుగా చూస్తున్నాయి. ఏది ఏమైనా, దశాబ్దాల కాలంగా నానుతున్న మహిళా రిజర్వేషన్ అంశం మరోసారి పార్లమెంటరీ గడప దాటలేకపోవడం 50 శాతం జనాభా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us