
ఆహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. అందరి హృదయాలను కలిచి వేసింది. ఈ ప్రమాదం 241 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఈ విమాన దుర్ఘటన నుంచి భూమి చౌహాన్ అనే మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. వాస్తవానికి ఆమె ఈ ఎయిరిండియా ఫ్లైట్(AI-171) ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్‌పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఫ్లైట్ మిస్ అయింది. కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయ్యానని.. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఆలోచిస్తుంటేనే.. వణుకు పుడుతోందని ఆమె జాతీయ మీడియాతో చెప్పుకొచ్చింది.
తాను విమానం మిస్ అయ్యిపోయానని తెలిశాక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయటకు వచ్చేశాను. ఇక లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలిన న్యూస్ విని.. పూర్తిగా కుంగిపోయాను. ‘నా శరీరం అంతా వణికిపోయింది. దేవుడికి నేను రుణపడి ఉంటా. గణపతి దేవుడే రక్షించాడని’ అని ఆమె చెప్పింది. వెకేషన్ కోసం తాను వచ్చానని, ఈ ఘటన తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని ఆమె పేర్కొంది.
ఇదిలా ఉంటే.. విమానయాన చరిత్రలోనే మరో అతిపెద్ద ప్రమాదంగా మారిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్.. ఘోర విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం సంచలనంగా మారింది. దాంతో.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు, పలుమార్లు చోటుచేసుకున్న సాంకేతిక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.