
భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కొన్ని హత్యల గురించి తెలుస్తుంటే.. మరీ ఇంత క్రూరంగా దారుణంగా కూడా ఒక మనిషిని చంపుతారా? అనేంత భయంకరంగా ఉంటున్నాయి. చంపేసి ముక్కలుగా నరుకుతున్నారు, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేస్తున్నారు, హనీమూన్‌కు తీసుకెళ్లి మరీ చంపుతున్నారు. ఇలాంటి అతి ఘోరమైన నేరాల వరుసలో మరో హత్య కూడా చేరింది. 50 ఏళ్ల భర్తను ఓ మహిళ తన ప్రియుడి కోసం అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ హత్య జరిగిన తీరు గురించి తెలిస్తే.. ఎంతటి వారికైన వణుకుపుట్టాల్సిందే.
ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. భర్తను తన ప్రేయుడితో కలిసి తన భర్తను హత్య చేసి నేరాన్ని కప్పిపుచ్చడానికి అతని మృతదేహాన్ని దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పారేసింది. జూన్ 24న జరిగిన ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు 50 ఏళ్ల శంకరమూర్తి ఒక ఫామ్‌హౌస్‌లో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. తిప్తూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేసే అతని భార్య సుమంగళ, కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ సంబంధానికి శంకరమూర్తి అడ్డుగా వస్తున్నాడని భావించి భార్య, ఆమె ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నారు. నేరం జరిగిన రోజున సుమంగళ తన భర్త కళ్లలో కారం పొడి చల్లి, కర్రతో కొట్టి అతని మెడపై కాలేసి తొక్కి అతన్ని దారుణంగా చంపిందని పోలీసులు తెలిపారు.
హత్య తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి దాదాపు 30 కిలో మీటర్లు తీసుకెళ్లి, తురువేకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో ఉన్న బావిలో పడేశారు. ఈ కేసు మొదట నోనవినకెరె పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైంది. అయితే గాలింపు చర్యలో బాధితుడి మంచంపై కారం పొడి జాడలు పోలీసులు కనుగొన్నారు. దీంతో ఇది హత్య కేసుగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. సుమంగళను మరింత విచారించగా ఆమె మొబైల్ కాల్ డిటైల్ రికార్డ్‌లను విశ్లేషించడంతో పోలీసులు హత్య కుట్రను ఛేదించారు. చివరికి ఆమె నేరం అంగీకరించింది. నోనవినకెరె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి