దళితులు అంటే ఎవరు? సీబీఎస్ఈ పరీక్షలో చెత్త ప్రశ్నలు!

|

Sep 08, 2019 | 2:10 AM

పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవ్వాలి. పరీక్షలలోని ప్రశ్నలు అయితే.. ఆలోచింపజేసేలా, విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలి. కానీ తాజాగా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయం నిర్వహించిన పరీక్షలో మాత్రం ఎవరూ ఊహించని ప్రశ్నలు అడిగారు. దళితులు, ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఉండటంతో ఇప్పుడిది చర్చనీయాంశం అయింది. ఇవేం చెత్త ప్రశ్నలు.. చిన్నపిల్లల మనసులో కులం, మతం అంటూ విషాన్ని నింపుతారా అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూస్తే.. […]

దళితులు అంటే ఎవరు? సీబీఎస్ఈ పరీక్షలో చెత్త ప్రశ్నలు!
Follow us on

పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవ్వాలి. పరీక్షలలోని ప్రశ్నలు అయితే.. ఆలోచింపజేసేలా, విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలి. కానీ తాజాగా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయం నిర్వహించిన పరీక్షలో మాత్రం ఎవరూ ఊహించని ప్రశ్నలు అడిగారు. దళితులు, ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఉండటంతో ఇప్పుడిది చర్చనీయాంశం అయింది. ఇవేం చెత్త ప్రశ్నలు.. చిన్నపిల్లల మనసులో కులం, మతం అంటూ విషాన్ని నింపుతారా అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూస్తే.. దళితులంటే ఎవరు..? అనే ప్రశ్నకు.. ఎ)విదేశీయులు, బి)అంటరానివారు, సి)మధ్య తరగతివారు, డి)ఎగువ తరగతివారు అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇక మరో ప్రశ్న ఏంటంటే? ముస్లింలకు సంబంధించిన ఈ క్రింది సాధారణాంశమేది..? అనే ప్రశ్నకు ఎ)ముస్లింలు బాలికలను పాఠశాలకు పంపరు. బి)వారు ప్యూర్‌ వెజిటేరియన్‌, సి)వారు రోఝా సమయంలో నిద్రపోరు, డి)పైవన్నీ.. అని ఆప్షన్లు ఇచ్చారు. అంతేకాదు దళితులు అంటే అంటరానివారు అని టిక్ పెట్టి కూడా ఉండటం గమనార్హం.

ఇక ఈ ప్రశ్నపత్రాన్ని తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ స్టాలిన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీబీఎస్‌ఈ ఆధ్యర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయ ఆరో తరగతి సాంఘీకశాస్త్రం ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్నలు అడిగినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ సిబ్బంది స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్‌ను తాము తయారు చేయలేదని.. అది ఫేక్ అని వెల్లడించారు.

అటు సీబీఎస్ఈ బోర్డు కూడా స్పందిస్తూ.. ఏ పాఠశాలలోనైనా ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కు తాము ప్రశ్నపత్రాలు సెట్ చేయమని.. కేవలం 10, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌కు మాత్రమే తాము ప్రశ్నపత్రాలను సిద్ధం చేస్తామని చెప్పింది. అందుకే సోషల్ మీడియాలో సీబీఎస్ఈ బోర్డుపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని ఓ అధికారి వెల్లడించాడు.

మరోవైపు కేంద్రీయ విద్యాలయ సంగథన్ కూడా చెన్నైలోని 49 కెవిలలో ఎవరూ కూడా ఇలాంటి పేపర్‌ను సిద్ధం చేయలేదని తమ ఆర్ఓ నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. అందువల్ల నెట్టింట్లో ప్రచారం అవుతున్న ఈ ప్రశ్నపత్రం ఏ కేంద్రీయ విద్యాలయానికి చెందినది కాదని స్పష్టమైంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని సోషల్ మీడియా వినియోగదాలను విద్యాలయ అధికారులు అభ్యర్ధించారు.