కలకత్తా, సెప్టెంబర్ 24: ఐదో తరగతి చదువుతోన్న పదేళ్ల బాలుడు చూపిన సమయస్ఫూర్తి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 22) ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామానికి చెందిన ముర్సెలీన్ (10) అనే విద్యార్ధి 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్ 22) మధ్యాహ్నం బాలుడు సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అప్పటికే మాల్దా జిల్లాలో జోరు వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలుడు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చోట రైల్వే ట్రాక్ కింద భూమి వానకు కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. సరిగ్గా అదే సమయానికి అటుగా అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేగంగా దూసుకు రావడాన్ని బాలుడు గమనించాడు. వెంటనే తాను ధరించిన ఎరుపు రంగు టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలు నడిపే అధికారులకు సిగ్నల్ ఇచ్చాడు.
లోకోపైలట్ గమనించి సకాలంలో రైలును ఆపాడు. రైలు నుంచి కిందికి దిగిన లోకోపైలట్ బాలుడి వద్దకు చేరుకుని రైలును ఎందుకు ఆపాడో అడిగి తెలుసుకున్నాడు. అక్కడ దెబ్బ తిన్న రైల్వే ట్రాక్‌ను చూసిన గార్డు ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు బాలుడిని అభినందించాడు. గార్డు వెంటనే భాలూకా రోడ్ స్టేషన్ జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు లైన్‌కింద ఉన్న రంధ్రాన్ని పూడ్చారు. అనంతరం గంటన్నర ఆలస్యంగా రైలు బయలుదేరింది. పాడైన ట్రాక్‌ను గుర్తించి రైలును ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు బాలుడు ముర్సెలీన్ షేక్ స్థానికంగా హీరోగా మారాడు. బాలుడి సాహసోపేతమైన, సమయానుకూల చర్యకు ముర్సెలీమ్ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు సిఫార్సు చేస్తామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.